Bandi Sanjay: కరువు మండలాల జాబితాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: కరువు మండలాల జాబితాపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యధిక లోటు వర్షపాతం ఉన్న చాలా మండలాలు జాబితాలో లేవు. మొక్కుబడిగా మండలాల జాబితాను ప్రకటించారు.. కరువు మండలాల ప్రకటనపై ఇంత వివక్ష ఎందుకు? అని ప్రశ్నించారు. అశాస్త్రియంగా వీటి ఎంపిక చేసినట్లు జాబితా చూస్తేనే అర్థమవుతుందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఈ మేరకు తాజాగా పత్రికా ప్రకటన విడుదల చేశారు. 35శాతం లోటు వర్షపాతం ఉన్న మండలాలు కూడా కరువు జాబితాలో లేకపోవడం బాధాకరమన్నారు. హుస్నాబాద్, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల్లో అనేక మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నా కన్పించడం లేదా? అని నిలదీశారు. పొలాలన్నీ బీళ్లుగా మారి తాగునీటికి ఇబ్బంది పడుతుంటే పట్టించుకోరా? అని ప్రశ్నించారు.

క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడితే పరిస్థితి తెలుస్తుందని బండి సంజయ్ అన్నారు. “నిధులు ఖర్చు చేయాల్సి వస్తుందని కరీంనగర్ పార్లమెంట్ ను విస్మరించారా?కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అత్యధిక మండలాలు కరువు జాబితాలోకి వచ్చే అర్హత ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో వర్షపాతం, సాగు విస్తీర్ణం, పంటల పరిస్థితిని ఒకే ప్రమాణాలతో పరిశీలించారా? కరువు మండలాలను ఎంపిక చేయడానికి ఉపయోగించిన అధికారిక గణాంకాలు, ప్రామణికాలు ఏమిటి? కరువు జాబితాలో లేని మండలాల్లో పంట నష్టం, నేలలో తేమ, భూగర్భ జలాల స్థితిగతులను పరిశీలించారా? కరువు మండలాలుగా గుర్తించని ప్రాంతాల రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్నారా? రాష్ట్ర సగటు వర్షపాతాన్ని మాత్రమే కాకుండా, ప్రతి మండలంలోని వర్షపాతం, పంటల పరిస్థితిని విడివిడిగా పరిశీలించారా? ఒక మండలంలో వర్షం కురిసిందని, పక్క మండలంలోనూ అదే పరిస్థితి ఉందని భావించడం శాస్త్రీయ పద్ధతి కాదు.. కరువు మండలాల గుర్తింపునకు ఉపయోగించిన గణాంకాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలి.. ప్రతి మండలానికి సంబంధించిన వర్షపాతం లోటు, పంటల పరిస్థితి, సాగు విస్తీర్ణం, నేలలో తేమ, భూగర్భ జలాల వివరాలను వెల్లడించాలి.. సర్వేలో మినహాయించిన గ్రామాలు లేదా మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించాలి.. అర్హత ఉన్న మండలాలు మినహాయించబడినట్లు తేలితే, నిబంధనలకు అనుగుణంగా వాటిని జాబితాలో చేర్చాలి.. రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి వాస్తవికత ఆధారంగా కరువు మండలాలను ప్రకటించాలి.. కరువు ప్రభావిత రైతులకు అర్హత మేరకు సహాయక చర్యలు అందించాలి.. పేదలకు పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించాలి.. రైతులు, పేదలకు అన్యాయం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.” అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.