మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. మొన్న కాళేశ్వరం ప్రాజెక్టులో మోటార్లు మునిగిపోయాయి.. ఇవాళ ప్రాజెక్టు కుంగిపోయిందని విమర్శించారు. ప్రాజెక్టుకు ఇంజనీర్ అని చెప్పుకుని తిరిగే కేసీఆర్ నుంచే డబ్బులు వసూలు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. నదులకు నడక నేర్పిన అపర భగీరథుడు ఎక్కడకి పోయాడు అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి బట్టబయలు అయింది.. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేశారు అని ఆయన ఆరోపించారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడే ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర పరువును కేసీఆర్ సర్కార్ తీస్తుందని బండి సంజయ్ మండిపడ్డారు. జరిగిన నష్టానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు.
Read Also: LEO : ఆ అరుదైన ఘనత సాధించిన లియో మూవీ…
ఇక, మంత్రి కేటీఆర్ పై కూడా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విరుచుకుపడ్డారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డ కేసీఆర్.. ప్రజా ధనాన్ని నాశనం చేశారని ఆయన ధ్వజమోత్తారు. కేటీఆర్ లా తండ్రి పేరు చెప్పుకుని తాను రాజకీయాల్లోకి రాలేదు అని ఆయన అన్నారు. కేటీఆర్ ది టూత్ పాలిష్ బతుకు.. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే కేటీఆర్ బిచ్చపు బతుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ అహంకార మదంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటూ కరీంనగర్ ఎంపీ మండిపడ్డారు. కేటీఆర్ కు ఉన్న అర్హత ఏంటో చెప్పాలి.. అమెరికాలో చిప్పలు కడిగిన విషయం మరిచిపోయావా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇంతకీ కేటీఆర్ మాట్లాడేది ఓ భాషేనా? అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.