హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ ఝాన్సీ మీద పోలీసుల దుశ్చర్య అమానుషమన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మీ. ఇవాళ ఝాన్సీని బండారు విజయలక్ష్మీ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరంకుశంగా జుట్టు పట్టి లాగడం అమానవీయం. ఏబీవీపీ కార్యదర్శి ఝాన్సి పై పోలీసుల దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కనికరం, దయ లేకుండా పోలీస్ మార్క్ ట్రీట్‌మెంట్‌ను చూపిస్తున్నారని ఆమె మండిపడ్డారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారు మహిళలకు కావాల్సింది బస్సులో ఉచిత ప్రయాణం కాదు, మహిళలకు కావాల్సింది ఫ్రీడం ఆఫ్ ప్రోటెస్ట్– ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అని ఆమె వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’ వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూముల జీవో నెంబర్ 55ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు నిరసనకు దిగారు. వారికి మద్దతుగా నిలిచి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఏబీవీపీ మహిళా కార్యకర్తపై లేడీ కానిస్టేబుల్స్ వ్యవహరించిన తీరు చూస్తే సభ్యసమాజం తలదించుకుంటోంది. సాటి మహిళ అని కూడా చూడకుండా లేడీ కానిస్టేబుల్ వ్యవహరించడం దుర్మార్గం. వ్విద్యార్థి, మహిళాలోకం ఝాన్సీకి అండగా నిలవాలి. ఏబీవీపీ విద్యార్థినిపై దాడికి పాల్పడిన మహిళా పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ విధానాన్ని విడనాడాలి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి.’ అని బండారు విజయలక్ష్మీ అన్నారు.
