Babar Azam React on His Captaincy Ahead of ENG vs PAK Match: వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ వైఫల్యంపై వస్తున్న విమర్శలపై కెప్టెన్ బాబర్ ఆజామ్ స్పందించాడు. టీవీలో మాటలు చెప్పడం చాలా సులువని పాక్ మాజీలకు చురకలు అంటించాడు. నాయకత్వ భారం తన బ్యాటింగ్‌పై ఎలాంటి ప్రభావం చేపలేదని స్పష్టం చేశాడు. ప్రపంచకప్ 2023 పాకిస్థాన్‌కు వెళ్లిన తర్వాత తన కెప్టెన్సీ విషయంలో ఏం జరుగుతుందో తెలియదని బాబర్ పేర్కొన్నాడు. అఫ్గానిస్తాన్ 8 వికెట్ల తేడాతో గెలవడం, దక్షిణాఫ్రికాపై 260కే 9 వికెట్స్ కోల్పోయినా 271 పరుగులను కాపాడుకోలేకపోవడంతో పాక్ మాజీలు మొయిన్ ఖాన్, షోయబ్ మాలిక్‌తో సహా మరికొందరు బాబర్‌పై విమర్శలు చేశారు.
ఇంగ్లండ్‌తో మ్యాచ్ నేపథ్యంలో శుక్రవారం బాబర్ ఆజామ్ మాట్లాడుతూ… ‘టీవీలో అభిప్రాయం చెప్పడం చాలా సులభం. ఎవరైనా సలహా ఇవ్వాలనుకుంటే.. నాకు నేరుగా నాకు చేయొచ్చు. నా నంబర్ అందరికీ తెలుసు’ అని పాక్ మాజీలను ఉద్దేశించి అన్నాడు. బాబర్ బ్యాట్స్‌మెన్‌గా రాజు అని, నాయకుడిగా మాత్రం కాదని షోయబ్ మాలిక్ పేర్కొన్నాడు. కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత బ్యాటింగ్‌పై ఎక్కువ దృష్టి సారించిన భారత బ్యాటర్ విరాట్ కోహ్లీని చూసి బాబర్ నేర్చుకోవాలని మొయిన్ ఖాన్ అభిప్రాయపడ్డాడు.
‘గత మూడేళ్లుగా నేను పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాను. అయితే నేను ఎప్పుడూ సారథ్యాన్ని భారంగా భావించలేదు. ప్రపంచకప్ 2023లో నేను ఆశించిన స్థాయిలో రాణించనందుకే ఒత్తిడిలో ఉన్నానని జనాలు అంటున్నారు. నేను ఒత్తిడిలో ఏమాత్రం లేను. ఫీల్డింగ్‌లో నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాను. బ్యాటింగ్ సమయంలో నేను పరుగులు చేసి జట్టును ఎలా గెలిపించాలి అని ఆలోచిస్తాను’ అని బాబర్ ఆజామ్ తెలిపాడు.
Also Read: ICC-SLC: ఐసీసీ కీలక నిర్ణయం.. శ్రీలంక క్రికెట్ బోర్డు సస్పెండ్!
ప్రపంచకప్ 2023 వైఫల్యం కారణంగా కెప్టెన్సీ నుండి వైదొలిగే అవకాశం జర్నలిస్టులు అడగ్గా.. ‘పాకిస్థాన్‌కు వెళ్లిన తర్వాత కెప్టెన్సీ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు దాని గురించి అస్సలు ఆలోచించట్లేదు. తర్వాతి మ్యాచ్‌పైనే నా దృష్టంతా. ఇంగ్లండ్‌పై భారీ విజయం సాధించడమే మా లక్ష్యం’ అని బాబర్ ఆజామ్ బదులిచ్చాడు. ప్రపంచకప్ 2023లో పాక్ కెప్టెన్ 282 పరుగులు చేయగా.. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. బాబర్ మూడంకెల స్కోరు అందుకోకపోవడమే జట్టును తీవ్రంగా దెబ్బతీసింది.