Notices To IndiGo: ఇండిగో విమానాల అంతరాయాలు ఐదో రోజుకూ చేరుకుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుంది. ఇవాళ ప్రధానమంత్రి కార్యాలయం (PMO) పరిస్థితిని సమీక్షించి, ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్తో మాట్లాడి, విమాన సర్వీసులను వెంటనే సాధారణ స్థితికి తీసుకురావాలని ఆదేశించింది. ఫ్లైట్ల రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఈ నేపథ్యంలో ఇండిగో సంస్థకు విమానయాన శాఖ నోటీసులు ఇచ్చింది. ఈ సందర్భంగా ఇండిగో సంక్షోభంపై పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
Read Also: Airtel Prepaid Plan: యూజర్లకు షాకిచ్చిన ఎయిర్టెల్.. ఆ చౌకైన ప్లాన్లకు మంగళం..
ఇక, మరోవైపు, ఇండిగో ప్రతినిధులు, సంస్థ సీఈవోను అత్యవసరంగా పిలిపించి, ప్రయాణికులకు ఇవ్వాల్సిన రీఫండ్లను ఆదివారం లోపు ఇచ్చేయాలని కేంద్ర ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. అలాగే, ఇండిగో కార్యకలాపాలు కొంత వరకు మెరుగుదల చూపుతున్నప్పటికీ, శనివారం నాడు కూడా 850 ఫ్లైట్లు రద్దు అయ్యాయి. నెట్వర్క్ను “రిబూట్” చేయడానికి శుక్రవారం కేవలం 700 ఫ్లైట్లే నడిపినట్లు సంస్థ తెలిపింది. శనివారం 1,500 కంటే ఎక్కువ ఫ్లైట్లను నడిపినట్లు ప్రకటించింది. ఇక, 95 శాతం రూట్లను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ప్రయాణికులకు క్షమాపణలు తెలిపిన ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్, విమాన సేవలను పూర్తిగా సాధారణ స్థితికి తీసుకురావడానికి వేగంగా పని చేస్తున్నామని వెల్లడించారు.