AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!

Aus W Vs Pak W

Aus W Vs Pak W

AUS W vs PAK W: మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా మహిళల జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. లీడ్స్ వేదికగా పాకిస్థాన్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 113 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసి సెమీఫైనల్ లో అడుగు పెట్టింది.

టాస్ అనంతరం తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ ఖాతా తెరవకుండానే ఔటైనా.. జార్జియా వోల్ 39 పరుగులతో మంచి శుభారంభం అందించింది. ఆ తర్వాత ఎల్లీస్ పెర్రీ (Ellyse Perry) 48 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ తో 71 పరుగులు చేసింది. చివర్లో నికోలా క్యారీ 13 బంతుల్లో 26 పరుగులతో వేగంగా ఆడటంతో ఆస్ట్రేలియా 199 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.

×
×
Ad

200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఇన్నింగ్స్ మొదటి నుంచే తడబడింది. ఓపెనర్ మునీబా అలీ 32 పరుగులతో పోరాడినా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఇరామ్ జావేద్ 14, కెప్టెన్ ఫాతిమా సనా 17 పరుగులు చేసినప్పటికీ జట్టును గట్టెక్కించలేకపోయారు. వరుస వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ 13.4 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్ లో నలుగురు బ్యాటర్స్ ఖాతా కూడా తెరవలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో సోఫీ మోలినెక్స్, అన్నాబెల్ సదర్లాండ్, ఎల్లీస్ పెర్రీ 2 వికెట్లు సాధించారు. జార్జియా వేర్‌హామ్ కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టడంతో పాటు తన రెండు ఓవర్లలో 11 డాట్ బాల్స్ వేసింది. ఆస్ట్రేలియా తరపున 8 మంది బౌలింగ్ వేయడం విశేషం.

బ్యాటింగ్‌లో 71 పరుగులు, బౌలింగ్‌లో 2 వికెట్లు తీసిన ఎల్లీస్ పెర్రీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేస్తూ.. 200 పరుగుల మార్క్‌ను చేరుకోవడమే తమ లక్ష్యమని, ప్రతి సవాలును ఆస్వాదిస్తూ ఆటను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది. మరోవైపు వరుసగా నాలుగో ఓటమి చవిచూసిన పాకిస్థాన్ టోర్నీ నుండి వైదొలిగింది. ఇప్పుడు వారికి నెదర్లాండ్స్‌తో ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఇక ఆస్ట్రేలియా తదుపరి మ్యాచ్‌లో భారత మహిళల జట్టును ఎదుర్కోనుంది.