NTV Telugu Site icon

Nitish Reddy Debut: పెర్త్‌ టెస్ట్.. తెలుగు కుర్రాడు నితీశ్‌ రెడ్డి టెస్టు అరంగేట్రం ఖాయమే!

Nitish Kumar Reddy Debut Test

Nitish Kumar Reddy Debut Test

ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా మొదటి టెస్టు జరగనుంది. ఈ సిరీస్‌ కోసం టీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుని.. ప్రాక్టీస్‌ చేస్తోంది. కెప్టెన్ రోహిత్‌ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో ఉండట్లేదని తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ అందుబాటులో లేకపోతే.. వైస్‌ కెప్టెన్‌ జస్ప్రీత్ బుమ్రా పెర్త్ టెస్టులో భారత జట్టును ముందుండి నడిపిస్తాడు.

భారత్ యువ ఆల్‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి టెస్టు అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పెర్త్‌లో ఆరంభమయ్యే తొలి టెస్టులో నితీశ్‌ ఆడే అవకాశాలు ఉన్నాయి. పెర్త్‌ పిచ్‌ పేస్, బౌన్స్‌కు అనుకూలంగా ఉంటుందనే అంచనాల నేపథ్యంలో నాలుగో సీమర్‌గా నితీశ్‌ను ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్‌ భావిస్తోందట. పిచ్‌ పరిస్థితులు నితీశ్‌ బౌలింగ్‌కు సరిగ్గా సరిపోతాయట. అంతేకాదు అతడు జట్టులో ఉంటే.. బ్యాటింగ్‌ బలం కూడా పెరుగుతుంది. రిషబ్ పంత్ మాదిరి హిట్టింగ్ చేయగల సామర్థ్యం నితీశ్‌ సొంతం. ఇద్దరు క్రీజులో ఉంటే పరుగుల వరద ఖాయం.

నితీశ్‌ రెడ్డి ఇటీవల బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. బంగ్లా సిరీస్‌లో ఆల్‌రౌండర్‌గా ఆకట్టుకున్నాడు. రెండో టీ20లో 34 బంతుల్లో 74 పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లూ కూడా తీశాడు. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు. భవిష్యత్‌ ఆల్‌రౌండర్‌గా నితీశ్‌ను పరిగణిస్తున్న బీసీసీఐ.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో చోటు కల్పించింది. ఇప్పటివరకూ 23 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 779 పరుగులు, 56 వికెట్లు పడగొట్టాడు. తెలుగు ప్లేయర్స్ వీవీఎస్ లక్షణ్, హనుమ విహారిలు భారత్ తరఫున సత్తాచాటిన విషయం తెలిసిందే.