NTV Telugu Site icon

AUS vs IND: డబుల్ సెంచరీకి చేరువలో అశ్విన్.. తొలి బౌలర్‌గా చరిత్ర!

Ashwin Jadeja

Ashwin Jadeja

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ఆరంభానికి సమయం దగ్గరపడింది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుతో సిరీస్ ఆరంభమవుతుంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 7.50కి పెర్త్ టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. తొలి టెస్టులనే విజయం సాధించి.. సిరీస్‌పై పట్టు సాధించాలని చూస్తున్నాయి. ఈ సిరీస్‌లో రాణించి.. ట్రోఫీతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరాలని భారత ఆటగాళ్లు పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలో కంగారులపై భారత్ ప్లేయర్లు అదిరే ప్రదర్శన చేస్తే పలు రికార్డులు సృష్టించనున్నారు.

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకోనున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) చరిత్రలో యాష్ ఇప్పటివరకు 194 వికెట్లు పడగొట్టాడు. మరో 6 వికెట్లు పడగొడితే.. డబ్ల్యూటీసీలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ (187) రెండో స్థానంలో ఉన్నాడు. పాట్ కమిన్స్ (175), మిచెల్ స్టార్క్ (147), కాగిసో రబాడ (137) టాప్-5లో ఉన్నారు.

Also Read: Koti Deepotsavam 2024: నేడు ‘కోటి దీపోత్సవం’లో 13వ రోజు.. ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వికెట్ల విషయంలో ఆర్ అశ్విన్, నాథన్ లైయన్ పోటీ నువ్వానేనా అన్నట్లు ఉంది. ప్రస్తుతం లైయన్ 116 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అశ్విన్ 114 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. నవంబర్ 22 నుంచి ప్రారంభంకానున్న ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన స్పిన్నర్‌.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలుస్తాడు. అశ్విన్, నాథన్ తుది జట్టులో కచ్చితంగా ఉంటారన్న విషయం తెలిసిందే.