NTV Telugu Site icon

AUS vs IND: భారత్‌తో తొలి టెస్ట్.. ఆస్ట్రేలియా కొత్త అస్త్రం!

Nathan Mcsweeney

Nathan Mcsweeney

భారత్‌తో బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2024 తొలి టెస్ట్ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. 13 మందితో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను ఎవరు ఆరంభిస్తారనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఇటీవల భారత్‌-ఎతో అనధికార టెస్టులో ఓపెనర్‌గా రాణించిన నాథన్‌ మెక్‌స్వీనీ టీమిండియాపై అరంగేట్రం చేయనున్నాడు. మెక్‌స్వీనీ భారత్‌-ఏపై రెండు ఇన్నింగ్స్‌ల్లో 39, 88 పరుగులు చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా దేశవాళీ ఫస్ట్‌క్లాస్‌ టోర్నీ షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో నిలకడగా రాణించాడు.

దిగ్గజ ప్లేయర్ డేవిడ్‌ వార్నర్‌ రిటైరయ్యాక ఉస్మాన్‌ ఖవాజాకు సరైన ఓపెనింగ్ జోడి లేకపోయింది. దాంతో ఆస్ట్రేలియాకు సరైన ఆరంభాలు దక్కక ఇబ్బంది పడుతోంది. స్టీవ్‌ స్మిత్‌ ఓపెనింగ్‌ చేసినా.. రాణించలేకపోయాడు. గత రెండు పర్యటనల్లో ఆసీస్ బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీని కోల్పోవడంతో.. ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి భారత్‌పై కొత్త అస్త్రంను సిద్ధం చేసింది. ఈ టెస్ట్ సిరీస్‌కు మార్కస్‌ హారిస్, సామ్‌ కొన్‌స్టాస్, కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ల పేర్లను పరిశీలించినప్పటికీ.. నాథన్‌ మెక్‌స్వీనీనే ఎంపిక చేశారు. దేశవాళీ టోర్నీలలో నిలకడగా రాణించడమే ఇందుకు కారణం. మరి మెక్‌స్వీనీ ఎలా ఆడుతాడో చూడాలి.

Also Read: SA vs IND: వరుణ్‌ మాయ చేసినా.. రెండో టీ20లో భారత్‌కు తప్పని ఓటమి!

ఆస్ట్రేలియా టెస్ట్ జట్టులో మరో కొత్త ప్లేయర్ కూడా ఉన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న వికెట్‌ కీపర్‌ కమ్ బ్యాటర్‌ జోష్‌ ఇంగ్లిస్‌ జట్టులోకి వచ్చాడు. ఇంగ్లిస్‌కు తొలిసారి టెస్టుల్లో అవకాశం దక్కడం ఇదే మొదటిసారి. అలెక్స్‌ కేరీకి తోడుగా ఇంగ్లిస్‌ను ప్రత్యామ్నాయ కీపర్‌గా ఆసీస్ సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే తుది జట్టులో చోటు దక్కడం మాత్రం కష్టమే అని చెప్పాలి. ఇది టెస్టుల్లో కేరీ రాణించకుంటే అవకాశం దక్కొచ్చు. నవంబర్ 22 నుంచి మొదటి టెస్ట్ ఆరంభం కానుంది.

తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు:
కమిన్స్‌ (కెప్టెన్‌), ఖవాజా, మెక్‌స్వీనీ, హెడ్, స్టీవ్‌ స్మిత్, లబుషేన్, కేరీ, మిచెల్‌ మార్ష్, ఇంగ్లిస్, లైయన్, స్టార్క్, హేజిల్‌వుడ్, బోలాండ్‌.

 

Show comments