Site icon NTV Telugu

Ashok Gehlot: బీజేపీ హయాంలోనే.. రాజస్థాన్‌ బాలికల వేలంపై స్పందించిన సీఎం

Ashok Gehlot

Ashok Gehlot

Ashok Gehlot: రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో రుణాల చెల్లింపుల కోసం బాలికలను వేలం వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై విచారణ కోసం జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సిడబ్ల్యూ) శుక్రవారం ఇద్దరు సభ్యులతో నిజ నిర్ధారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. భిల్వారా జిల్లాకు దర్యాప్తు బృందాన్ని పంపినట్లు కమిషన్‌ ఛైర్మన్‌ రేఖా శర్మ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఈ విషయంపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ శనివారం స్పందించారు. ఈ వార్తలను ఆయన కొట్టిపారేశారు. గతంలో బీజేపీ హయాంలో ఈ తరహా ఘటనలు జరిగాయని ఆయన వెల్లడించారు. వాటి కాంగ్రెస్ ప్రభుత్వమే బయటపెట్టినట్లు చెప్పారు.

గతంలో 2005లో రాష్ట్రంలో బీజేపీ హయాంలో ఈ ఘటనలు జరిగాయని అశోక్‌ గహ్లోత్‌ తెలిపారు. 2019లో మేం అధికారంలోకి వచ్చాక ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చామన్నారు. మొత్తం 21 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. మరో ముగ్గురు మృతి చెందగా.. ఒకరు పరారీలో ఉన్నారన్నారు. ఇద్దరు బాధితులు మృతి చెందారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పరిశీలకుడిగా ఆయన ప్రస్తుతం గుజరాత్‌ పర్యటనలో ఉన్నారు.

South Korea: హాలోవీన్‌ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 150 మంది మృతి

ఇదిలా ఉండగా.. పలు వివాదాలను పరిష్కరించుకునే క్రమంలో స్టాంప్‌ పేపర్లు రాయించుకొని బాలికలను వేలం వేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్‌ రేఖా శర్మ శుక్రవారం తెలిపారు. కొన్నేళ్లుగా ఈ తరహా ఘటనల గురించి వార్తలు వస్తున్నా.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు భిల్వాఢా జిల్లాకు కమిషన్‌ బృందాన్ని పంపినట్లు వెల్లడించారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ సైతం ఈ విషయంపై స్పందించింది. మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సంగీత బేణీవాల్‌.. శనివారం భిల్వాఢా జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు అయితే ఈ వార్తలను రాజస్థాన్‌ మంత్రి ప్రతాప్‌ ఖచారియావాస్‌ ఖండించారు. ‘ఇలాంటి ఘటనల్లో విచారణ పూర్తయ్యేవరకు వాస్తవాలు తెలుసుకోలేం. దీనిపై జాతీయ మహిళా కమిషన్‌ మొదట రాజస్థాన్‌ పోలీసులతో మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో బాలికల అమ్మకాలు జరగడం లేదు’ అని అన్నారు.

Exit mobile version