ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దక్షిణ గాజా నగరమైన రఫాపై దాడి చేయవద్దని అమెరికా, ఇతర దేశాలు ఒత్తిడి చేస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. రఫాలో పాలస్తీయన్ ప్రజలు ఖాళీ చేయాలని, సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని మరోసారి ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌క్లేవ్‌లోని 11, ఇతర పరిసరాలను ఖాళీ చేసి సురక్షిత మైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఈ మేరకు శనివారం ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి ఎక్స్(గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. గాజా నగరానికి పశ్చిమానా ఉన్న ఆశ్రయాలకు వెళ్లాలని సూచించారు. రఫాలో భారీ దాడి జరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
READ MORE: Mumbai Hoarding : ముంబై హోర్డింగ్ ప్రమాదం.. 14కి పెరిగిన మృతుల సంఖ్య.. యజమానిపై ఎఫ్ఐఆర్
ఈ క్రమంలోనే తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. ఐక్యరాజ్య సమితితో కలిసి గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ భారతీయుడి వాహనంపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆ భారతీయుడు మృతి చెందారు. రఫాలో ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై దాడి జరిగింది. దీంతో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఐరాసలో పనిచేస్తున్న అంతర్జాతీయ సిబ్బందిలో సంభవించిన తొలి మరణం ఇదే అని అధికారులు తెలిపారు. చనిపోయిన భారతీయుడు ఐరాసలోని భద్రత, రక్షణ విభాగంలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఆయన వివరాలను మాత్రం ఇంతవరకు ఎవ్వరూ వెల్లడించలేదు. కానీ, గతంలో భారత సైన్యంలో పనిచేసినట్లు పీటీఐకి విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రఫాలోని యురోపియన్ హాస్పిటల్‌కు వెళ్తుండగా.. వాహనంపై దాడి జరిగింది. ఈ ఘటనలో మరో డీఎస్‌ఎస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు. సామాన్యులతో పాటు మానవతా సాయం అందజేస్తున్న సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని పిలుపునిచ్చారు.