ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో మూకుమ్మడి హత్య ఘటన వెలుగు చూసింది. దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో ఓ ఇంట్లోకి ప్రవేశించిన ముగ్గురు దొంగలను గ్రామస్థులు చితకబాదారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి.. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Manchu Manoj: మళ్లీ మా అమ్మ దగ్గరకే.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్
వివరాల్లోకి వెళ్తే.. రాంపూర్ మధుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. లోకియా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లోకి ఆదివారం ఉదయం ముగ్గురు దొంగలు చొరబడ్డారు. అక్కడ దొంగతనం చేసి బయటపడినప్పటికీ.. మరో ఇంట్లో చోరి చేసేందుకు వెళ్లారు. అయితే ఇంట్లో దొంగలు పడ్డారని గట్టిగా అరిచారు కుటుంబసభ్యులు. దీంతో పక్కనే ఉన్న స్థానికులు ఇంటిచుట్టూ గుమికూడి పారిపోతున్న ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. వారిని కర్రలు, రాడ్లతో చితకబాదారు.
Read Also: Heavy Rains: అగ్రరాజ్యం అమెరికాపై హరీకేన్ హిల్లరీ తుఫాన్ ఎఫెక్ట్
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురు దొంగలను గ్రామస్తుల బారి నుంచి విడిపించారు. తీవ్ర గాయాలైన వారిని జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే ఒకరు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వారు రాంపూర్ మధురకు చెందిన భోండు కృష్ణ, సదర్‌పూర్‌కు చెందిన అంకిత్ పూర్ మనోహర్, ఆశిష్‌గా గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భోండు మృతి చెందాడు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ చక్రేష్ మిశ్రా తెలిపారు. దొంగిలించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను కొట్టిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
