NTV Telugu Site icon

Chittoor Dairy: చిత్తూరు డెయిరీని అమూల్‌కు కట్టబెట్టొద్దు.. సీఎస్‌కు లేఖ

Atchannaidu

Atchannaidu

Chittoor Dairy: చిత్తూరు డైయిరీని అమూల్ కు ధారాదత్తం చేయడం సరికాదంటూ ఏపీ సీఎస్‌ జవహర్ రెడ్డికి లేఖ రాశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. చిత్తూరు డెయిరీని అమూల్ కు అప్పగించడమంటే తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే.. ఇక్కడి ప్రజాసంపద, సహకార డైయిరీల వేలకోట్ల విలువైన ఆస్తులను అమూల్ కు కట్టబెట్టడతారా..? దశాబ్దాల కాలం నుంచి ఉన్న సహకార వ్యవస్థను మూసివేసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత సహకార డైయిరీలతో పాటు మూతపడిన చిత్తూరు డైయిరీని పునరుద్ధరిస్తామని వైఎస్‌ జగన్ హామీ ఇచ్చి.. సీఎం కాగానే మాట మార్చారు అంటూ లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రంలోని సహకార వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు అని విమర్శించారు అచ్చెన్నాయుడు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సహకార డెయిరీలను బలహీనపర్చేలా గుజరాత్ కు చెందిన అమూల్ ను తీసుకువచ్చారు. ఇప్పుడు చిత్తూరు డైయిరీ పునరుద్ధరణ పేరుతో అమూల్ కు కట్టబెడుతుండటం దుర్మార్గం. ప్రభుత్వ నిర్ణయాలతో పాడి రైతులకు ద్రోహం చేస్తున్నారు. ఇప్పటికే మౌలిక వసతులు, ఇతర సహకార డైయిరీల ఆస్తులు కలిపి రూ.6వేల కోట్ల ప్రజాసంపదను అమూల్ కు దోచి పెడుతున్నారు అని ఆరోపించారు. చిత్తూరు డైయిరీని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. అమూల్ కు ఏడాదికి రూ.కోటి లీజుపై 99 ఏళ్లకు అప్పగించారు. చిత్తూరు డెయిరీకి చెందిన రూ.650 కోట్ల ఆస్తులు సైతం కట్టబెట్టారు అని విమర్శించారు.

ఇక, చిత్తూరు నగరంలో కలెక్టరేట్‌ సమీపాన ప్రధాన రహదారి మీద ఉన్న 33 ఎకరాల స్థలంతో పాటు వి.కోట, మదనపల్లె, పీలేరు, శ్రీకాళహస్తి, పిచ్చాటూరులో చిల్లింగ్ సెంటర్లు కూడా అప్పజెప్పారు. జర్మనీ, జపాన్‌ వంటి విదేశాల నుంచి తెప్పించిన సామగ్రి విలువ సుమారు రూ.30 కోట్లు పైనే ఉంటుంది. ఈ సంపదనంతా సీఎం జగన్‌.. అమూల్ కు అప్పనంగా ఇస్తున్నారు. చివరకు చిత్తూరు డెయిరీ వ్యవస్థాపకుడి విగ్రహం సైతం కూలగొట్టడం ప్రభుత్వ టెర్రరిజానికి నిదర్శనం కాదా? అంటూ లేఖలో నిలదీశారు. సహకార రంగ డెయిరీలను సమర్థంగా నడిపే సత్తా ఇక్కడి వారికి లేదా? స్థానికంగా ఉండే డెయిరీలను కాదని ఎక్కడో గుజరాత్ కు చెందిన అమూల్ ను తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు.

అమూల్ వల్ల ఇక్కడ ఉద్యోగాల కల్పన జరగదనే వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలని సూచించారు అచ్చెన్నాయుడు.. ఇక్కడి ఉద్యోగాలను, సంపదను పొరుగు ఉన్న అమూల్ కు ధారాదత్తం చేస్తున్నారు. మన పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు అమూల్ మోసాన్ని గ్రహించి దూరం పెట్టాయి. కర్ణాటక తమ రాష్ట్రంలోని నందిని డెయిరీని, తమిళనాడు రాష్ట్రం ఆవిన్ డెయిరీ, పొరుగున ఉన్న తెలంగాణ విజయ డెయిరీకి మద్దతుగా నిలుస్తుండగా.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం గుజరాత్ కు చెందిన అమూల్ డెయిరీకి బ్రాండ్ అంబాసిడర్ లా వ్యవహరిస్తున్నారు. అమూల్ కంటే తక్కువ నిధులు అవసరమయ్యే రాష్ట్ర డెయిరీలకు మద్దతుగా నిలబడకపోవడం వెనుక కమీషన్లే కారణమా? అమూల్ వల్ల ప్రజలకు కలిగే లాభాలేమిటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని డిమాండ్‌ చేశారు. అమూల్ కంటే స్థానిక డెయిరీలే రైతులకు ఎక్కువ ధర చెల్లిస్తున్నాయి. వీన్నింటిని విస్మరించి అమూల్ కు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఎన్నికలకు ముందు పాడి రైతులకు లీటర్‌ పాలకు రూ.4 బోనస్‌ ఇస్తామనే హామీపై సీఎం జగన్‌ మాట తప్పి మడమ తిప్పారు.. బోనస్ గా రైతులకు ఏడాదికి రూ.312 కోట్లు చొప్పున ఇప్పటివరకు సుమారు రూ.,1,250 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందని.. ఈ నగదును రైతులకు ఎప్పుడు చెల్లిస్తారో సమాధానం చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.