Minister Satyakumar Yadav: మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వాజ్‌పేయ్ ఒక సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగారని అన్నారు. పార్టీలు, ప్రాంతాలు, వర్గాలు, వైషమ్యాలకు అతీతంగా ఆయన అందరితో శభాష్ అనిపించుకున్నారని చెప్పారు. పది సార్లు లోక్ సభ సభ్యునిగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా పని చేశారని, మూడు సార్లు ఈ దేశ ప్రధానిగా పని చేసి, దేశం రూపురేఖలు మార్చారని కొనియాడారు. ఒక్క అవినీతి మచ్చ కూడా లేని నిష్కలంక చరితుడు, హిమాలయాలు అంత మహోన్నత వ్యక్తి వాజ్‌పేయ్ అని అన్నారు.
READ ALSO: Sachin Tendulkar: క్రికెట్ దేవుడి సంపద ఎంత? సచిన్ టెండూల్కర్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ కావాల్సిందే!
ఆయన అనేక సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటూ విలువతో కూడిన రాజకీయాలు చేశారని చెప్పారు. నమ్మిన సిద్దాంతం కోసం పని చేస్తూ, రెండు సీట్ల నుంచి బీజేపీని అప్రతిహతంగా అధికారంలో ఉండేలా పునాదులు వేసిన వ్యక్తి వాజ్‌పేయ్ అని అన్నారు. విజయనగరం ప్రజలు సాహితీ ప్రియులని, వాజ్ పేయ్ కూడా కళా హృదయం, కవితా హృదయం కలిగిన వారని చెప్పారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేలా, ప్రజల కన్నీళ్లు తుడిచేలా ఆయన పని చేశారని గుర్తు చేశారు. అపజయాన్ని ఏనాడు అంగీకరించకుండా, విజయాన్ని సాధించే వరకు పట్టువదలని విక్రమార్కుడిలా పని చేశారని పేర్కొన్నారు. నిజమైన నాయకుడు కాలంతో కరిగిపోయేవాడు కాదని, కలకాలం ప్రజల గుండెల్లో నిలిచేవారని చెప్పారు. ఆయన శత జయంతి సందర్భంగా నేడు సుపరిపాల యాత్ర ద్వారా అందరికీ ఆ గొప్పతనం చెప్పాలని నిర్ణయించినట్లు తెలిపారు. వాజ్‌పేయ్ చూపిన దారిలోనే ప్రధాని మోడీ నడుస్తూ, ఆ పథకాలు, అభివృద్దిని ముందుకు తీసుకు వెళుతున్నారని చెప్పారు. ఐదు దశాబ్దాల పాటు వెంకయ్యనాయుడు, వాజ్‌పేయ్‌తో కలిసి నడిచారని, అదే విలువలను వెంకయ్యనాయుడు కూడా పాటిస్తూ ప్రజలకు సేవలు అందించారని అన్నారు. అటల్ జీ, చంద్రబాబు నాయకత్వంలో వెంకయ్యనాయుడు సారథిగా పని చేశారని గుర్తు చేశారు.
READ ALSO: Hyderabad: నార్సింగి లో దారుణం.. కాళ్ల పట్టీల కోసం వివాహిత దారుణ హత్య..
