Assembly Elections 2023: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఢిల్లీలోని ఆకాశవాణి భవన్‌లో ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విలేకరుల సమావేశాన్ని ప్రారంభించారు. ఎన్నికల తేదీలను ప్రకటించేందుకు అందరం ఇక్కడికి వచ్చామని చెప్పారు. ఆరు నెలల తర్వాత ఇక్కడ కలుస్తున్నామన్నారు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల తేదీల ప్రకటన చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రాల ఎన్నికల తేదీలను కమిషన్ ప్రకటించనుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ పీసీలో ఉన్నారు. ఈసీ అధికారులు మొత్తం ఐదు రాష్ట్రాల్లో పర్యటించారని, రాజకీయ పార్టీలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించారని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. రాజకీయ పార్టీల సూచనలను కూడా తీసుకున్నట్లు ఈసీ తెలిపింది.
ఐదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 8.2 కోట్ల మంది పురుష ఓటర్లు, 7.8 కోట్ల మంది మహిళా ఓటర్లు, 60.2 లక్షల మంది ఫస్ట్ టైమ్ ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. మిజోరంలో మొత్తం 8.52 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 2.03 కోట్ల మంది, మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్ల మంది, రాజస్థాన్‌లో 5.25 కోట్ల మంది, తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

ఓటింగ్ కోసం 1.77 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటర్లకు ఓటు వేసే సౌకర్యం ఉంటుంది. పోలింగ్ బూత్ 2 కిలోమీటర్ల దూరంలో ఉండదు. పార్టీలు అక్టోబర్ 31లోగా విరాళాల గురించి సమాచారం ఇవ్వాలి. అప్పుడే ఆదాయపు పన్నులో మినహాయింపు లభిస్తుందని ఆయన చెప్పారు. కొన్ని పార్టీలు ఇప్పటికే తమ నివేదికలను ఆన్‌లైన్‌లో సమర్పించడం ప్రారంభించాయి. అక్రమ నగదు, మద్యం, ఉచిత వస్తువులు, మాదకద్రవ్యాల సరిహద్దు తరలింపులను తనిఖీ చేసేందుకు ఐదు రాష్ట్రాల్లో 940కి పైగా అంతర్-రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నారు.వీటిని రాష్ట్ర పోలీసులు, వివిధ భద్రతా సంస్థలు నిర్వహిస్తాయి. వృద్ధులకు ఇంటి నుండే ఓటు వేసే సౌకర్యం కల్పిస్తారు.
మిజోరంలో ముందుగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. నవంబర్ 7న మిజోరాంలో ఓటింగ్ జరగనుంది. దీంతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా నవంబర్ 7న ఓటింగ్ జరగనుంది. రాజస్థాన్ లో నవంబర్ 23న తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు నిర్వహణ ఉంటుంది. అనంతరం డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. 17,734 మోడల్ పోలింగ్ స్టేషన్లు, 621 పోలింగ్ స్టేషన్ల నిర్వహణ బాధ్యత పీడబ్ల్యూడీ సిబ్బందిదేనని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 8,192 పోలింగ్ కేంద్రాల్లో మహిళలు బాధ్యతలు చేపట్టనున్నారు.