దక్షిణ మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ సిబ్బంది ఒకరు కాల్పులకు పాల్పడ్డాడు. తన సహచరులపై కాల్పులు జరపగా.. ఆరుగురు గాయపడ్డారు. ఆపై ఆ జవాన్ తనను తాను కాల్చుకున్నాడు. ఈ విషయాన్ని మణిపూర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటన మంగళవారం అర్థరాత్రి సాజిక్ తంపాక్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై మణిపూర్ పోలీసులు విచారణకు ఆదేశించారు. కాల్పులకు పాల్పడిన సైనికుడిది చురాచాంద్‌పుర్ అని గుర్తించారు.
గాయపడిన వారిని చికిత్స కోసం మిలటరీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉంది. గాయపడిన వారిలో ఎవరూ మణిపూర్‌కు చెందినవారు కాదని మణిపూర్ పోలీసులు చెప్పారు. మణిపూర్‌లో కొనసాగుతున్న జాతి కలహాలకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు పేర్కొన్నారు. మణిపూర్‌లోని అన్ని అస్సాం రైఫిల్స్ బెటాలియన్లలో పలు వర్గాలకు చెందిన వారు ఉన్నారని, అందరూ శాంతి భద్రతలను కాపాడేందుకే కలిసి పనిచేస్తున్నారని చెప్పారు.
Also Read: Canada Plane Crash: కెనడాలో విమాన ప్రమాదం.. ఆరుగురి మృతి!
గత సంవత్సరం అక్టోబర్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని ఎల్‌ఓసీ సమీపంలో ఒక ఫార్వర్డ్ బేస్ వద్ద ఆర్మీ మేజర్ తన తోటి సైనికులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కొంతమంది సైనికులు గాయపడ్డారు. ఈ ఘటన రాజౌరిలోని థానమండి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆర్మీకి చెందిన 48 రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌లు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మణిపూర్ జాతి హింసతో అట్టుడుకుతోంది. గత మేలో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగాయి. అప్పటి నుంచి మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు నమోదవుతున్నాయి.