Assam Floods: అస్సాంలో ముంచెత్తిన వరదలు.. 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

Assam

Assam

Assam Floods: అస్సాంలో సంభవించిన భారీ వరదలు తీరని విషాదాన్ని మిగిల్చాయి. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ASDMA) విడుదల చేసిన తాజా హెచ్చరిక ప్రకారం, శివసాగర్ జిల్లాలో ఇద్దరు, గోలాఘాట్‌లో ఒకరు మరణించడంతో వరద మృతుల సంఖ్య ఏకంగా 78కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లో ఇప్పటికీ 3 లక్షలకు పైగా ప్రజలు వరద కష్టాల్లో మునిగిపోయారు. 21 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 551 గ్రామాలు నీటమునిగాయి. సుమారు 21,523 హెక్టార్ల పంట పొలాలు మునిగిపోయి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. బాధిత జిల్లాల్లో చరాయిదేవు పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. ఇక్కడ ఏకంగా 1.37 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆ తర్వాత శివసాగర్, జోర్హాట్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రస్తుతం 71 పునరావాస కేంద్రాల్లో 16,500 మందికి పైగా ఆశ్రయం పొందుతుండగా, మరో 72,000 మందికి 30 సహాయ కేంద్రాల ద్వారా నిత్యావసరాలు అందిస్తున్నారు. వరద తాకిడికి మౌలిక వసతులు, రోడ్లు, పాఠశాలలు ధ్వంసమవ్వడమే కాకుండా.. 11,000కు పైగా జీవాలు కొట్టుకుపోయాయి. మరో వైపు రాజధాని గువాహటితో పాటు కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో అర్బన్ ఫ్లడ్డింగ్ (పట్టణ వరదలు) ఇంకా వీడలేదు. పడుంబరి, బోరాగావ్, జూ రోడ్, హాతిగావ్ వంటి అనేక ప్రాంతాలు బురద, నీటితో నిండిపోయాయి.

పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలను సమీక్షించారు. కేంద్రం నుంచి అన్ని రకాల సాయం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. వరద నీరు తగ్గుముఖం పట్టినా, ఇళ్లలోకి చేరిన బురద, ధ్వంసమైన రోడ్ల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం తెలిపారు. బాధితులను ఆదుకోవడానికి బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రుణ సదుపాయాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ తూర్పు ప్రాంత పర్యటనలో భాగంగా సేనలు చేపడుతున్న వరద సహాయక చర్యలను సమీక్షించి, బలగాల సేవలను అభినందించారు. ఇదిలా ఉంటే, వాతావరణ శాఖ (IMD) నుంచి మరో బాంబు లాంటి వార్త వచ్చింది. జులై 30 నుంచి ఆగస్టు 1 వరకు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తీన్‌సుకియాతో పాటు పొరుగు రాష్ట్రాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ వర్షాల వల్ల మళ్లీ హఠాత్తుగా వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించడంతో, సహాయక బృందాలు మరియు విపత్తు నిర్వహణ శాఖ అలర్ట్‌లో ఉన్నాయి.