Nagarkurnool Childrens Kidnap News: ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో చిన్నారుల కిడ్నాప్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. గ్రామాల్లో చిన్నారులను అపహరించే ముఠాలు సంచరిస్తుండడంతో.. జనాలు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొందరు పిల్లలు అపహరణకు గురికాగా.. అందులో కొందరిని పోలీసులు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. పోలీసుల నిఘా, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉన్నా కూడా ముఠాలు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో చిన్నారులను అపహరించేందుకు అగంతకులు ప్రయత్నం చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలో ఉయ్యాలవాడలో కొందరు అగంతకులు చిన్నారులను అపహరించి.. వారిని ఆటోలో ఎక్కించుకుని వెళుతున్నారు. పిల్లలు ఆటోలో ఉండడం గమనించిన గ్రామ యువకులు వారిని అడ్డుకున్నారు. దాంతో చిన్నారులను వదిలేసి వారు పారిపోయారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలను ఎత్తుకుపోయే గ్యాంగ్ అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: CA Exams: విద్యార్థులకు శుభవార్త.. ఏడాదికి మూడుసార్లు సీఏ పరీక్షలు!
సులువుగా లక్షలు సంపాదించాలనే ఉద్దేశంతోనే కొందరు పిల్లలను కిడ్నాప్ చేస్తున్నట్లు సమాచారం. కొందరు ముఠాగా ఏర్పడి పిల్లలను కిడ్నాప్ చేసి రాష్ట్రాలను దాటిస్తున్నారు. పిల్లలను ఇతర రాష్ట్రాల్లోని ఇళ్లు, హోటళ్లలో పనులకు పెట్టి.. వెట్టి చాకిరీతో పాటు భిక్షాటనకు ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. రద్దీ ప్రాంతాలు, ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారులకు మాయమాటలు చెబుతూ కిడ్నాపర్లు తమ చేతివాటం ప్రదర్శిస్తారు. కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.