పాకిస్థాన్ స్పిన్నర్ ఆసిఫ్ అఫ్రిది చరిత్ర సృష్టించాడు. టెస్ట్ అరంగేట్రంలో ఐదు వికెట్లు తీసిన అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో అఫ్రిది ఐదు వికెట్స్ పడగొట్టి ఈ ఘటన అందుకున్నాడు. 38 సంవత్సరాల 301 రోజుల వయసున్న ఆసిఫ్.. అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా 92 ఏళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఈ రికార్డు ఇంతకుముందు ఇంగ్లండ్‌కు బౌలర్ ఛార్లెస్ మారియట్ పేరిట ఉంది. వెస్టిండీస్‌పై మారియట్ 37 ఏళ్ల 332 రోజుల వయసులో 5 వికెట్స్ పడగొట్టాడు.
1933 ఆగస్టు 12న ది ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో చార్లెస్ మారియట్ తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 11.5 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లోనే కాదు రెండవ ఇన్నింగ్స్‌లో కూడా 29.2 ఓవర్లలో 59 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. దాంతో టెస్ట్ అరంగేట్రంలో ఐదు వికెట్లు తీసిన అతి పెద్ద బౌలర్‌గా నిలిచాడు. తాజాగా ఆ రికార్డును ఆసిఫ్ అఫ్రిది బద్దలు కొట్టాడు. హసన్ అలీ స్థానంలో అఫ్రిది జట్టులోకి వచ్చాడు. అంచనాలకు మించి రాణించిన అతడు.. ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డిజోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, కాగిసో రబాడ లాంటి కీలక వికెట్లు తీశాడు.
Also Read: Hussey-Sachin: సచిన్ కంటే 5 వేల రన్స్ ఎక్కువే చేసేవాడిని.. ఆస్ట్రేలియా దిగ్గజం షాకింగ్ కామెంట్స్!
రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులకు ఆలౌటైంది. షాన్ మసూద్ (87), షఫీక్ (57), సౌద్ షకీల్ (66) హాఫ్ సెంచరీలు చేశారు. కేశవ్ మహారాజ్ 7 వికెట్స్ పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 404 రన్స్ చేసింది. సెనురన్ ముత్తుసామి (89 నాటౌట్), రబాడ (71), ట్రిస్టన్ స్టబ్స్ (76), టోనీ డి జోర్జి (55) అర్ద శతకాలు బాదారు. పాక్ బౌలర్ ఆసిఫ్ అఫ్రిది 6 వికెట్స్ తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 16 పరుగులకే 3 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది.