Asian Games 2026 Final: ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. నిస్షిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరుగుతున్న గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో శ్రీలంక ముందు 217 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఈ మ్యాచ్ లో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం చేసింది. కేవలం 45 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 79 పరుగులు చేసి అదరగొట్టింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన మంధాన.. మూడో ఓవర్‌లో సిక్సర్ బాదడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది.
మంధానకు తోడుగా మరో ఓపెనర్ షఫాలీ వర్మ కూడా ధాటిగా ఆడింది. 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు చేసింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌కు శుభారంభం అందించారు. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ 19 పరుగులు చేయగా, రిచా ఘోష్ చివర్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పారు.
రిచా ఘోష్ కేవలం 22 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 49 పరుగులు చేసింది. చివరి ఐదు ఓవర్లలో భారత్ 74 పరుగులు రాబట్టి స్కోరును 216కి చేర్చింది. భర్తి ఫుల్మాలి 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఇక స్మృతి మంధానకు ఇది మరో చారిత్రాత్మక మైలురాయి. ఇటీవలే మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మిథాలీ రాజ్ రికార్డును అధిగమించిన మంధాన.. ఇప్పుడు 11 వేల అంతర్జాతీయ పరుగుల మార్క్‌ను కూడా అందుకున్నారు. ఫైనల్‌కు ముందు ఆమె ఖాతాలో 10,987 పరుగులు ఉండగా.. మరో 13 పరుగులు చేస్తే 11 వేల పరుగుల క్లబ్‌లో చేరాల్సి ఉంది. మూడో ఓవర్‌లోనే ఆ ఘనతను సాధించారు.
భారత్ తరఫున టెస్టుల్లో 788, వన్డేల్లో 5,411, టీ20ల్లో 4,788 పరుగులు సాధించిన మంధాన.. ఇటీవల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అత్యధిక పరుగుల రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నారు. దీంతో ఆసియా క్రీడల ఫైనల్లో ఆమె మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నారు. 2023 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళల జట్టు.. ఈసారి కూడా గోల్డ్ మెడల్ కోసం బరిలోకి దిగింది. మరోవైపు శ్రీలంకకు ఆసియా క్రీడల్లో ఇది తొలి స్వర్ణం కోసం జరుగుతున్న పోరు.
Innings Break!#TeamIndia put up the highest-ever total in women's cricket at the #AsianGames 💥
Over to our bowlers in the Gold Medal match 👌
Scorecard ▶️ https://t.co/x367kJHmrc pic.twitter.com/F9yXv49dWz
— BCCI Women (@BCCIWomen) September 22, 2026

