Shubman Gill could return as vice-captain: ఆసియా కప్ 2025 త్వరలో ఆరంభం కానుంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు టోర్నీ జరగనుంది. ఆతిథ్య హక్కులు భారత్ వద్దే ఉన్నా.. గతంలో పాకిస్తాన్‌తో ఒప్పందం కారణంగా యూఏఈలో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆసియా కప్ కోసం ఆగస్టు మూడో వారంలో భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది. జట్టు ప్రకటనకు మరో వారమే ఉండడంతో.. బీసీసీఐ సన్నాహాలను మొదలు పెట్టింది. దాదాపు 25 మంది ప్లేయర్లు జట్టులో చోటు దక్కించుకునేందుకు పోటీలో ఉన్నారు. దాంతో ఇప్పుడు భారత జట్టుపై ఆసక్తి నెలకొంది.
టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌నెస్‌పై ఎలాంటి స్పష్టత లేదు. రెండు నెలల కింద సూరీడు హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న సూర్యను ఎన్‌సీఏ వైద్య బృందం పరీక్షించింది. సూరీడు ప్రస్తుతం ఫుల్ ఫిట్‌గా లేడని సమాచారం. అతడు మరో వారం రోజుల పాటు ఎన్‌సీఏలోనే ఉండనున్నాడట. ఫిజియోలు, వైద్య బృందం పర్యవేక్షణలో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడట. ఫిట్‌నెస్ సాధిస్తే సూర్యనే ఆసియా కప్ 2025లో కెప్టెన్‌గా ఉంటాడు. వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డిప్యూటీగా అక్షర్ పటేల్ ఉన్నాడు. భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లకు గిల్‌నే కెప్టెన్‌గా ఉంచాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ 2026 అనంతరం సూర్య స్థానంలో గిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: MS Dhoni: నా మోకాలి నొప్పి ఎవరు భరిస్తారు?.. అభిమానితో ఎంఎస్ ధోనీ!
ఫిట్‌నెస్ టెస్టు కోసం స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎన్‌సీఏలో ఉన్నాడు. రెండు రోజులుఅక్కడే ఉండి ఫిట్‌నెస్ టెస్టులను పూర్తి చేయనున్నాడు. ఫస్ట్ ఛాయిస్ కీపర్ సంజు సాంశన్ అంటూ వార్తలు వస్తున్నాయి. గాయం కారణంగా పంత్ ఆసియా కప్‌లో పాల్గొనేది డౌటే. రెండో వికెట్ కీపర్ రేసులో జితేశ్ శర్మ, ఇషాన్ కిషన్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్ పోటీలో ఉన్నారు. గత రెండేళ్లుగా అంతర్జాతీయ టీ20లు ఆడని రాహుల్‌కు నిరాశ తప్పదు. యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాయి సుదర్శన్ కూడా ఆసియా కప్ 2025కు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025లో రాణించిన ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా పేరును కూడా బీసీసీఐ సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బుమ్రా, సిరాజ్ ఫిట్‌నెస్ టెస్టులు పాసవ్వాల్సి ఉంది. జట్టుకు ఎవరు ఎంపికవుతారా? అని ఇప్పుడు ఆసక్తిగా ఉంది. ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించడం సెలక్టర్లకు కత్తిమీద సాము అనే చెప్పాలి.
