India vs Pakistan: ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ మధ్య సూపర్ ఫోర్ మ్యాచ్ సెప్టెంబర్ 21 ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. సూర్యకుమార్ నేతృత్వంలోనే జట్టు ఈ మ్యాచ్‌లో కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని చూస్తోంది.
ఈ మ్యాచ్ కు ముందు.. పాకిస్థాన్ క్రికెట్ జట్టు కొత్త వ్యూహాన్ని అనుసరించింది. జట్టు ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ను రద్దు చేసుకుంది. అదనంగా, జట్టు తన శిబిరంలోకి మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ రహీల్ ను చేర్చుకుంది. పాకిస్థాన్ జట్టు ఈ ఆకస్మిక చర్య అభిమానులను ఆశ్చర్యపరిచింది. మ్యాచ్ కు ముందు ప్లేయర్లు బయటి వ్యక్తుల నుంచి వచ్చే ఆటంకాలు, మీడియా నుంచి ఉత్పన్నమయ్యే ప్రశ్నలకు దూరంగా ఉండాలని పాక్ బోర్డు కోరుకుంటోంది. జట్టు మానసికంగా బలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆటగాళ్లకు మానసిక బలం, ఆత్మవిశ్వాసాన్ని అందించడానికి జట్టులో ఒక ప్రేరణాత్మక స్పీకర్‌ను చేర్చారు. డాక్టర్ రహీల్ .. పాక్ ఆటగాళ్లకు మానసిక బలం, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి శిక్షణ ఇస్తారట. ఇదంతా చూస్తుంటే ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో భయం మొదలైనట్లు కనిపిస్తోంది?
READ MORE: KTR : రోడ్ సేఫ్టీ కాదు, కాంగ్రెస్ స్కామ్..కేటీఆర్ సంచలన ఆరోపణలు.!
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన గ్రూప్-దశ మ్యాచ్‌లో షేక్‌హ్యాండ్ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్స్‌తో కరచాలనం చేయడానికి నిరాకరించారు. దీంతో పాకిస్థాన్ జట్టు ఆగ్రహానికి గురైంది. పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశాన్ని బహిష్కరించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) భారత జట్టు, మ్యాచ్ రిఫరీ ఆండీ పైకాట్‌పై ఫిర్యాదు చేసింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పీసీబీ ఫిర్యాదులను తిరస్కరించడంతో తోకముడిచింది.
