Site icon NTV Telugu

Asia Cup 2025: బెంచ్‌లో ‘ఆ నలుగురు’.. భారత తుది జట్టు ఇదేనా?

India Playing 11

India Playing 11

India predicted playing XI for Asia Cup 2025: ఆసియా కప్‌ 2025 యూఏఈలో సెప్టెంబర్ 9న ఆరంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. దాంతో ఆసియా కప్‌లో బరిలోకి దిగే జట్టుపై సస్పెన్స్ వీడింది. భారత జట్టుపై సస్పెన్స్ వీడినా.. ప్లేయింగ్ 11లో ఎవరుంటారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. బౌలింగ్ విషయంలో క్లారిటీ ఉన్నా.. బ్యాటింగ్ లైనప్‌ ఎలా ఉంటుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. 15 మందిలో 11 మందికి అవకాశం వస్తుంది. మిగతా నలుగురు బెంచ్‌లో ఉండాల్సిందే. తుది జట్టులో ఉండే అవకాశాలు ఎవరికి మెండుగా ఉన్నాయో ఓసారి చూద్దాం.

ఓపెనింగ్ కాంబినేషన్‌పై చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ హింట్ ఇచ్చాడు. సంజూ శాంసన్ రెగ్యులర్ ఓపెనర్ కాదని.. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ లేకపోవడంతోనే అవకాశం దక్కిందని చెప్పాడు. దాంతో అభిషేక్ శర్మతో కలిసి గిల్ ఓపెనర్‌గా దిగడం ఖాయం అయింది. ఫస్ట్ డౌన్‌లో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ రెండు సెంచరీలు చేశాడు కాబట్టి ఆ ప్లేస్ ఫిక్స్. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో, ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో బరిలోకి దిగుతారు. వికెట్ కీపర్‌గా జితేష్ శర్మ కంటే సంజూ శాంసన్‌ ఆడే అవకాశాలే ఎక్కువ. సంజూ 6 లేదా 5వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. సంజూ 5లో ఆడితే.. హార్దిక్ 6లో వస్తాడు. రింకూ సింగ్‌కు తుది జట్టులో చోటు కష్టమే.

స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ ఆడడం పక్కా. అక్షర్ ఇటీవలి రోజుల్లో బాగా ఆడుతున్న విషయం తెలిసిందే. శివమ్‌ దూబెకు నిరాశ తప్పదు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగుతారు. దుబాయ్ పిచ్‌లు స్పిన్ అనుకూలంగా కాబట్టి ఈ ఇద్దరు ఆడే అవకాశం ఉంది. ఒకవేళ అభిషేక్ శర్మ, అక్షర్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు కాబట్టి.. కుల్దీప్, చక్రవర్తిలో ఒకరికే అవకాశం దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే జరిగితే ఫినిషర్‌గా రింకూ సింగ్‌ ఆడతాడు. ఇది జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఇక పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ జట్టులో ఉండడం ఖాయం. మూడో పేసర్ హార్దిక్ పాండ్యా ఉండనే ఉన్నాడు. హర్షిత్ రాణా బెంచ్‌లో ఉంటాడు.

Also Read: Asia Cup 2025: 165 స్ట్రైక్‌రేట్ ఉన్నా భారత జట్టులో లేడు.. ఆడడం తప్ప ఇంకేం చేయగలం?

భారత తుది జట్టు (అంచనా):
శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్ (కీపర్), అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.
బెంచ్‌ ప్లేయర్స్: రింకూ సింగ్‌, శివమ్‌ దూబె, హర్షిత్ రాణా, జితేష్ శర్మ.

Exit mobile version