ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా ఈరోజు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌లలో ఆధిపత్యం చలాయించిన భారత్.. నేడు కూడా ఫెవరేట్‌గా బరిలోకి దిగనుంది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న పాక్ సూపర్-4లో టీమిండియాను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌పై టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై అనవసర హైప్ వద్దని, ఇది కూడా ఓ మామూలు మ్యాచే అని పేర్కొన్నాడు.
‘మేము ఒమన్‌తో మంచి మ్యాచ్ ఆడాం. ఒమన్ టీమ్ బాగా ఆడింది. జట్టుగా మేం పరీక్షను ఎదుర్కొన్నాం. దుబాయ్‌లో చాలా వేడిగా ఉంది. అయినా కూడా టీమిండియా ప్లేయర్స్ ప్రతిఒక్కరూ తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. 21న పాకిస్థాన్‌తో ఆడబోయేది కేవలం మరో మ్యాచ్ మాత్రమే. మ్యాచ్ జరిగినప్పుడే ఆడదాం, అంతకు ముందు కాదు. గుడ్‌లక్’ అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. హార్దిక్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.
Also Read: Astrology: సెప్టెంబర్ 21, ఆదివారం దినఫలాలు.. ఏ రాశి వారు ఏ పరిహారం చెల్లించాలి..?
ఆసియా కప్ 2025 గ్రూప్ స్టేజ్‌లో యూఏఈ, పాకిస్థాన్, ఒమన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. గ్రూప్ ఏలో సూర్య సేన టాప్‌లో ఉంది. సూపర్ 4లో పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతో భారత్ తలపడనుంది. సూపర్ 4లో టాప్ 2లో నిలిచిన టీమ్స్ ఫైనల్స్ ఆడతాయి. సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్‌తో జరిగిన గత ఆరు మ్యాచుల్లో భారత్ విజేతగా నిలవడం విశేషం.
