Site icon NTV Telugu

Asia Cup 2025: యూఏఈతో భారత్ మ్యాచ్.. బుమ్రాను ఆడిస్తే స్ట్రైక్‌ చేస్తా!

Jasprit Bumrah

Jasprit Bumrah

ఆసియా కప్‌ 2025లో భాగంగా మరికొన్ని గంటల్లో యూఏఈతో భారత్ తలపడనుంది. దుబాయ్‌ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. తుది జట్టులో ఎవరుంటారు అనే దానిపై ఇప్పటికే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ కసరత్తు చేశారు. ఐదుగురు స్పెషలిస్ట్‌ బ్యాటర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లు, నలుగురు బౌలర్లు ప్లేయింగ్ 11లో ఉండే అవకాశాలు ఉన్నాయి. యూఏఈతో మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్‌ జడేజా కీలక వ్యాఖ్యలు చేశారు. యూఏఈపై స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఆడించొద్దని, ఒకవేళ ఆడిస్తే తాను స్ట్రైక్‌ చేస్తా అని చెప్పారు.

‘యూఏఈపై జస్ప్రీత్ బుమ్రాను ఆడించాల్సిన అవసరం ఏముంది?. అతడిని అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. యూఏఈ జట్టుపై బుమ్రా ఆడాల్సిన అవసరం లేదు. అతడిని మనం రక్షించుకోకపోతే ఇంకెందుకు?. నేను యూఏఈ జట్టుని తక్కువ చేయడం లేదు, అగౌరవపరచడం లేదు. యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీమ్‌ను చూశా. అతడు చాలా టాలెంటెడ్. భారత్ టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టు. యూఏఈతో మ్యాచ్‌లో బుమ్రాని ఆడిస్తే నేను స్ట్రైక్‌ చేస్తా. ఈ విషయంలో నేను పూర్తి స్పష్టతతో ఉన్నా’ అని సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో అజయ్‌ జడేజా అన్నారు.

Also Read: IND vs UAE: యూఏఈతో మ్యాచ్.. ప్లేయింగ్ 11పై హింట్ ఇచ్చేసిన బౌలింగ్‌ కోచ్!

ఈ సంవత్సరం ప్రారంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం తిరగబెట్టిన విషయం తెలిసిందే. ఈ గాయం అతడిని ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి కూడా దూరం చేసింది. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. ఆసియా కప్‌ 2025లో కూడా ఆడడం అనుమానమే అని వార్తలు వచ్చినా.. బుమ్రా తాను ఆడుతానని సెలెక్టర్లకు చెప్పాడు. టీ20 మ్యాచ్‌లే కాబట్టి టోర్నీ మొత్తం ఆడే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version