కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25కు సంబంధించిన మధ్యంతర బడ్జె్ట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో 2024 – 25 మధ్యంతర బడ్జెట్ పై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. 2024 – 25 బడ్జెట్ లో ఆంధ్రపదేశ్ కు 9138 కోట్లు కేటాయింపు, 2024- 25 బడ్జెట్ లో తెలంగాణకు 5071 కోట్ల కేటాయింపు చేసినట్లు తెలిపారు. కాజీపెట్ రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ పనులు కొనసాగుతున్నాయని, ఎప్పుడు లేని విధంగా గత పదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో రైల్వే అభివృద్ధి జరిగిందన్నారు. రైల్వే బ్రిడ్జి లు, కొత్త రైల్వే ట్రాక్ ల నిర్మాణం, ఎలక్ట్రిఫికేషన్ , ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరిగిందని ఆయన వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో రైల్వే అభివృద్ధికి ప్రధానంగా భూమీ సమస్య ఉందని, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్త శుద్ది తో రైల్వే అభివృద్ధికి ముందుకు రావాలన్నారు అశ్విని వైష్ణవ్.
అనంతరం సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం మాట్లాడుతూ.. సౌత్ సెంట్రల్ పరిధిలో జరిగిన ప్రమాదాల మీద విచారణ జరుగుతుందన్నారు. ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయ్యిందన్నారు. త్వరలో సనత్ నగర్ – మౌలాలి ఎంఎంటీఎస్ సర్వీస్ ప్రారంభం కానున్నట్లు ఆయన తెలిపారు. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉందని, ఇప్పటివరకు 50 శాతం నిధులు మాత్రమే వచ్చాయన్నారు. నిధుల ఆలస్యంగానే సెకండ్ ఫేజ్ లేట్ అయ్యిందని, చర్ల పల్లి రైల్వే టెర్మినల్ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయన్నారు.
