తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అషు రెడ్డి పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రియాలిటీ షోలు, బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమెపై హైదరాబాద్ సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS)లో భారీ ఆర్థిక మోసం కేసు నమోదైంది. ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి సుమారు 9.35 కోట్ల రూపాయల మేర ఆస్తులు, నగదు కాజేసినట్లు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం..
లండన్‌లో పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వై.వి. ధర్మేంద్రకు 2018లో అషు రెడ్డితో పరిచయం ఏర్పడింది. తాను సినిమాల్లో రాణించాలని ప్రయత్నిస్తున్నానని చెప్పి అతనికి దగ్గరైనట్లు ఆరోపణలు ఉన్నాయి. కొద్దిరోజులకే వీరి పరిచయం ప్రేమగా మారడం, పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో బాధితుడు ఆమె అడిగినప్పుడల్లా డబ్బులు పంపినట్లు తెలిపారు. బాధితుడి తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం,
2018 నుంచి 2025 వరకు అషు రెడ్డి వివిధ రూపాల్లో దాదాపు 9 కోట్లు పైమాటే తీసుకున్నట్లుగా తెలిపారు. అలాగే 5 కిలోల బంగారంతో పాటుగా.. ధర్మేంద్ర పంపిన డబ్బుతో కారు, ఫ్లాట్లు కొనుగోలు చేసి తన పేరు మీద రిజిస్టర్ చేయించుకుందట అషు. అలా అన్నీ కలిపి రూ. 9.35 కోట్ల మేర ఉంటాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదనంగా ఆమె సోదరి కూడా రూ. 50 లక్షలు తీసుకున్నారని కూడా ఫిర్యాదులో ఉంది. బాధిత కుటుంబం పెళ్లి గురించి ఒత్తిడి చేయగా అషు నిరాకరించడంతో, వారు పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి అషు రెడ్డి బ్యాంక్ ఖాతాలు, గత ఏడేళ్ల కాలంలో ఆమె కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను ఆరా తీస్తున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాత ఆమెను విచారణకు పిలిచే అవకాశం ఉంది.
గతంలో డ్రగ్స్ కేసు నిందితుడు కేపీ చౌదరి కాల్ లిస్ట్ వ్యవహారంలో అషు రెడ్డి పేరు వినపడగా, ఆ తర్వాత ఆమె తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. తాజాగా ఈ ‘లవ్ అండ్ మనీ’ స్కామ్ ఆమె కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే అషు, ఈ తాజా కేసుపై ఎలా స్పందిస్తారో చూడాలి.
