Site icon NTV Telugu

Gehlot vs Pilot: అశోక్‌, సచిన్‌ల మధ్య కుదిరిన రాజీ ఫార్ములా.. అర్ధరాత్రి వరకు సాగిన చర్చలు

Rajasthan

Rajasthan

Ashok Gehlot vs Sachin Pilot: రాజస్థాన్​​ కాంగ్రెస్‌లో ఏర్పడిన అంతఃకలహాలకు ముగింపు పలికేందుకు ఆ పార్టీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే దిల్లీ నుంచి హైకమాండ్​ పిలుపు మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్, సీనియర్ నేత సచిన్ పైలట్​.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్​ గాంధీతో సమవేశమయ్యారు. ఈ భేటీ సుమారు నాలుగు గంటల పాటు జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు, ఒకరు తర్వాత మరొకరు అధికారంలోకి వస్తున్న దశాబ్దాల చరిత్రను ఛేదించి వరుసగా ఈసారి కూడా రెండోసారి అధికారంలోకి వచ్చేలా సమిష్టిగా పనిచేయాలని రాహుల్ గాంధీ సమక్షంలో నిర్ణయం తీసుకున్నారు. అర్ధరాత్రి వరకు ఖర్గే నివాసంలో చర్చోపచర్చలు కొనసాగాయి. ఎట్టకేలకు గహ్లోత్-పైలట్‌ల మధ్య సయోధ్య కుదర్చడంలో ఏఐసీసీ అధిష్ఠానం సఫలీకృతమైనట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం నుంచి రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభ పరిష్కారానికై ముఖ్యనేతల వరుస భేటీలు, మంతనాలు జరిగాయి.

ఇదిలా ఉండగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని నిర్ణయించుకున్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. రాజస్థాన్‌లో మరో సారి అధికారాన్ని కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమష్టిగా పనిచేసేందుకు అశోక్ గహ్లోత్​, సచిన్ పైలట్ ఇద్దరూ ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారని తెలిపారు. 2018లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి అశోక్‌ గహ్లోత్​, పైలట్ మధ్య అధికార పోరు కొనసాగుతోంది. 2020 జులైలో డిప్యూటీ సీఎంగా ఉన్న పైలట్‌.. మరో 18 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసి గహ్లోత్‌ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. అధిష్ఠానం జోక్యంతో ఆ సంక్షోభానికి తెరపడింది. ఆ తర్వాత పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవుల నుంచి తొలగించారు.

Read Also: Bus Accident: లోయలో పడిన బస్సు.. 10 మంది మృతి, 20 మందికి గాయాలు

ఇటీవలే గత బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, ప్రభుత్వ ఉద్యోగుల నియామక పరీక్ష పత్రాల లీకేజీ అంశాలపై 15 రోజుల్లోగా చర్యలు చేపట్టకపోతే తన ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తానని సచిన్ పైలట్ సొంత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ రాజకీయ సంక్షోభాన్ని.. కాంగ్రెస్​ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. మే 26న రాష్ట్ర నేతలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. కానీ పలు అనివార్య కారణాల వల్ల ఆ సమావేశం వాయిదా పడింది.

Exit mobile version