Asha Sobhana India Women Team Debut: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ఆశా శోభన ఎట్టకేలకు భారత జట్టులో అరంగేట్రం చేశారు. సోమవారం (మే 6) సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్ మహిళలలతో జరుగుతున్న నాలుగో టీ20లో శోభనకు భారత తుది జట్టులో చోటుదక్కింది. భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన చేతుల మీదగా శోభన టీమిండియా క్యాప్ అందుకున్నారు. అయితే 33 ఏళ్ల వయస్సులో ఆమె అంతర్జాతీయ అరంగేట్రం చేయడం గమనార్హం.
భారత మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్‌ను ఆదర్శంగా తీసుకుని క్రికెట్‌ను కెరీర్‌గా ఆశా శోభన ఎంచుకున్నారు. 13 ఏళ్ల వయస్సులోనే ఆమె క్రికెట్ వైపు అడుగులు వేశారు. కేరళ తరపున అద్భుతంగా రాణించడంతో భారత-ఏ జట్టులో చోటు దక్కింది. గత కొన్నేళ్లుగా మంచి ప్రదర్శన చేస్తున్నా.. భారత జాతీయ జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు. డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్‌లో రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు శోభన కొనుగోలు చేసింది. తొలి సీజన్‌లో పెద్దగా రాణించని శోభన.. డబ్ల్యూపీఎల్ 2024లో అదరగొట్టారు. 10 మ్యాచ్‌ల్లో 7.11 ఏకానమితో 12 వికెట్లు తీశారు.
Also Read: IPL 2024: అతడు చాలా ప్రమాదకరం.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ పక్కా!
డబ్ల్యూపీఎల్ 2024 ప్రదర్శనతో భారత సెలక్టర్ల దృష్టిలో ఆశా శోభన పడ్డారు. తాజాగా ఆమెకు భారత్ జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ మహిళలలతో జరుగుతున్న నాలుగో టీ20లో శోభన ఆడుతున్నారు. శోభన భారత్ తరఫున రాణించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. దేశీవాళీ క్రికెట్‌లో కేరళ సీనియర్ జట్టుకు ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు.