NTV Telugu Site icon

Asani Cyclone: బలహీనపడిన ‘అసని’.. అయినా అప్రమత్తంగానే ఉండాలి

Asani Cyclone

Asani Cyclone

బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ బలహీనపడుతోంది. మచిలీపట్నానికి సమీపంలో తీవ్ర వాయుగుండంగా నుంచి బలహీనపడి వాయుగుండంగా మారినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. మరికొద్ది గంటల తర్వాత ఇదే ప్రాంతంలో తిరుగుతూ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Breaking: తీరం దాటిన అసని తుఫాన్

వాయుగుండం కారణంగా తీరం వెంబడి గంటకు 45- 55కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు. సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. అసని తుఫాన్ బలహీనపడినప్పటికీ ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని పేర్కొన్నారు. ప్రజలు అత్యవసర సాయం కోసం 1070 హెల్ప్ లైన్ నంబరుకు కాల్ చేయాలన్నారు.

మరోవైపు అసని తుఫాన్ బలహీనపడుతున్నా.. దాని ప్రభావంతో గురువారం, శుక్రవారాల్లో తెలంగాణలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నాడు రాష్ట్రంలో 82 చోట్ల మోస్తరు వర్షాలు కురిసినట్లు వెల్లడించింది. మంచిర్యాల జిల్లా కొత్తపల్లిలో అత్యధికంగా 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. కాగా హైదరాబాద్‌లో గత రెండు రోజుల్లో 10 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత తగ్గింది.