NTV Telugu Site icon

SA vs IND: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. ఆ ఇద్దరి అరంగేట్రం ఖాయమే! విషయం చెప్పేసిన సూర్య

Surya Kumar Yadav Practice

Surya Kumar Yadav Practice

దక్షిణాఫ్రికా, భారత్‌ జట్ల మధ్య టీ20 పోరుకు వేళయింది. ఇరు జట్ల మధ్య నేటి నుంచి నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు తెరలేవనుంది. డర్బన్ వేదికగా శుక్రవారం రాత్రి 8.30 గంటలకు తొలి మ్యాచ్‌ ఆరంభం కానుంది. ఇటీవల బంగ్లాదేశ్‌పై క్లీన్‌స్వీప్‌ విజయంతో భారత్ మంచి జోరుమీదుంటే.. సొంతగడ్డపై సత్తాచాటేందుకు సఫారీ టీమ్ సై అంటోంది. ఇప్పటికే కుర్రాళ్లతో కూడిన టీమిండియా.. ఈ సిరీస్‌లో ఇద్దరికి అరంగేట్ర అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్ మాటలు ఇందుకు మరింత బలం చేకూర్చాయి.

దక్షిణాఫ్రికాలో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్ చెఫ్‌ అవతారం ఎత్తాడు. అయితే సూర్య ఓ వంటకం గురించి చెప్పాడు కానీ.. అది తినేది మాత్రం కాదు. మైదానంలోకి దిగేందుకు సిద్ధమయ్యే భారత జట్టు గురించి. ఆ వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ‘హాయ్‌ ఫ్రెండ్స్‌ నేను మీకోసం రెండు అద్భుతమైన రెసిపీలను తీసుకొచ్చా. అవి మైదానంలో బరిలోకి దిగేందుకు మాత్రమే. ఒకరు అద్భుతమైన బౌలర్. మరొకరు సూపర్ బ్యాటర్. ఫాస్ట్‌ బౌలర్‌ అంటే బలంగా ఉండాలి, తెలివిగా వ్యవహరించాలి. ఆ రెండు గుణాలు మనోడిలో ఉన్నాయి. అతడే వైశాఖ్ విజయ్‌ కుమార్’ అని సూర్య చెప్పాడు.

‘రెండో రెసిపీకి ఎంతో ధైర్యం ఉంది. ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. ఎప్పుడూ అతనిలో ఉత్సాహం కనిపిస్తుంది. ఫుట్‌వర్క్‌ మసాలా అయితే చాలా బాగుంటుంది. రుచికరమైన చట్నీ లాంటి ఏకాగ్రత, పసందైన పొడులు మాదిరిగా షాట్లు కొట్టే టైమింగ్‌ అతడి సొంతం. అతడే రమణ్‌దీప్‌ సింగ్. ఈ ఇద్దరు అద్భుతంగా ఆడుతారని నేను భావిస్తున్నా. వారికి ఆల్ ది బెస్ట్’ అని సూర్యకుమార్‌ యాదవ్ వీడియోలో చెప్పుకొచ్చాడు. విజయ్‌ కుమార్, రమణ్‌దీప్‌ సింగ్‌లు తొలి మ్యాచ్‌లో ఆడతారో? లేదో చూడాలి.

Also Read: Today Gold Rate: ‘బంగారం’ సంతోషం ఒక్కరోజే.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్స్!

భారత టీ20 జట్టు ఇదే:
సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, రింకూ సింగ్‌, తిలక్‌ వర్మ, జితేశ్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌, అర్షదీప్‌ సింగ్‌, వైశాఖ్ విజయ్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌, యశ్‌ దయాల్‌.