NTV Telugu Site icon

Article 370: ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు!

Supreme Court

Supreme Court

Supreme Court verdict on abrogation of Article 370: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 రద్దు అంశంపై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. జమ్మూకశ్మీర్‌ అంశంలో రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకున్న నిర్ణయం అని పేర్కొంది. ఆర్టికల్‌ 370 అనేది తాత్కాలిక నిబంధన మాత్రమే అని సుప్రీంకోర్టు వెల్లడించింది. న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది.

ఆర్టికల్ 370 యుద్ధ నేపథ్యంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ‘జమ్మూకశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్‌ చేయలేరు. భారత్‌లో విలీనం తర్వాత జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదు. అప్పుడు యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఆర్టికల్‌ 370ని ప్రవేశపెట్టారు. అది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. ఆర్టికల్‌ 370ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. హక్కుల విషయంలో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకత ఏమీ లేదు. మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో జమ్మూకశ్మీర్‌ సమానమే. ఆర్టికల్ 1, ఆర్టికల్‌ 370 ప్రకారం.. జమ్మూకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ స్పష్టం చేశారు.

జమ్మూకశ్మీర్‌ నుంచి లడఖ్‌ను విభజించి.. దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో రాష్ట్ర హోదాను త్వరగా పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. 2024 సెప్టెంబరు 30వ లోగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు చేపట్టాలని సుప్రీం ఆదేశించింది.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆపై దాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా (జమ్మూకశ్మీర్‌, లడఖ్) విభజించింది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. జమ్మూకశ్మీర్‌కు చెందిన పలు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని 5గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2023 ఆగస్టు 2 నుంచి విచారణ చేపట్టింది. 2023 సెప్టెంబరు 5న సుప్రీం తన తీర్పును రిజర్వులో ఉంచింది. సోమవారం (డిసెంబర్ 11) ఆ తీర్పును వెలువరించింది.