Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుపాను పంజా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవులు!

Arnab Cyclone Alert

Arnab Cyclone Alert

Arnab Cyclone Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అర్నబ్ అతి తీవ్ర తుపానుగా బలపడుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా తుఫాన్ పయనిస్తోంది. గంటకు 23 కి.మీ. వేగంతో పయనిస్తున్న అర్నబ్.. 24 గంటల పాటు ప్రభావం చూపనుంది. తుపాను వేగంగా కదులుతుండటంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు పడవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

అర్నబ్ తుపాను గత ఆరు గంటల్లో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదిలింది. సాయంత్రం వరకు పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి.. ఆ తర్వాత వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు ఉదయానికి బాపట్ల–విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో తీరం దాటే అవకాశమున్నట్లు సమాచారం. తుపాను ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. తీర ప్రాంతాల్లో ఇప్పటికే గాలుల తీవ్రత పెరిగినట్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

అర్నబ్ తుపాను ప్రభావంతో విశాఖపట్నం తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటంతో పాటు సముద్రం ముందుకు చొచ్చుకురావడం, తీరప్రాంతం కోతకు గురవడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి. సముద్రం ప్రమాదకరంగా మారడంతో బీచ్‌లలో పర్యాటకుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. రుషికొండ బీచ్‌ను ఏపీ టూరిజం మూసివేసింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు. తీర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

తుపాను ప్రభావంతో ఇబ్బందులు ఎదురైతే త్వరితగతిన స్పందించేందుకు మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా సహాయం పొందవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రజలు వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, జిల్లా కలెక్టర్ల నుంచి వెలువడే అధికారిక హెచ్చరికలను మాత్రమే అనుసరించాలని సూచించారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, సముద్ర తీరాలకు సమీపంగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.