Siddipet Army Jawan Missing in Punjab: పంజాబ్‌లో సిద్దిపేట జిల్లాకి చెందిన ఆర్మీ జవాన్ మిస్ అయ్యాడు. అనిల్ (30) అనే జవాన్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నట్టు చెప్పి అదృశ్యమయ్యాడు. అనిల్ ఆచూకీ గత ఆరు రోజులుగా లభించడం లేదు. అనిల్ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులకు ఆర్మీ సిబ్బంది సమాచారం ఇచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. తమ కుమారుడిని వెతికి పెట్టాలని అనిల్ కుటుంబ సభ్యులు ఆర్మీ సిబ్బందిని కోరారు.
కొమురవెళ్లి మండలం ఐనాపూర్ గ్రామానికి చెందిన అనిల్ 11 ఏళ్లుగా పంజాబ్‌లో ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అనిల్‌కి భార్య, రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. గత నెల ప్రమోషన్ రావడంతో సికింద్రాబాద్ ఆర్మీ క్యాంపులో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు. 18 రోజులు ఇంటి వద్ద ఉండి ఆగస్టు 6న పంజాబ్ వెళ్లి.. 7న డ్యూటీలో చేరాడు. ఆగస్ట్ 8న అనిల్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పి కాల్ కట్ చేశాడు. కుటుంబ సభ్యులు తిరిగి కాల్ చేయగా.. నాట్ రీచబుల్ వచ్చింది. అనిల్ కనిపించడం లేదంటూ ఆర్మీ సిబ్బంది అనిల్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. జవాన్ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.