Arjun Ram Meghwal: బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో దీపావళి సంబరాలు.. కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం!

Arjun Ram Meghwal

Arjun Ram Meghwal

Arjun Ram Meghwal: దీపావళి పండుగ వేళ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ (Arjun Ram Meghwal)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బీఎస్‌ఎఫ్‌ (BSF) జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఆయన్ను ఆనుకుని ఒక స్కై షాట్ (Sky shot) రాకెట్ దూసుకెళ్లడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. రాజస్థాన్‌లోని బికనేర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బీఎస్‌ఎఫ్‌ హెడ్‌క్వార్టర్స్‌లో జవాన్లతో కలిసి మంత్రి దీపావళి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరితో కలిసి టపాసులు కాల్చే కార్యక్రమంలోనూ ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. మంత్రి చేతిలో కాకరకాయ ఒత్తి పట్టుకుని ఒక స్కై షాట్ రాకెట్‌ను వెలిగించేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ అనూహ్య ఘటన జరిగింది.

మంత్రి రాకెట్‌ను వెలిగించడానికి ప్రయత్నిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో అక్కడే ఉన్న మరో వ్యక్తి అప్రమత్తంగా వ్యవహరించకుండా అదే స్కై షాట్‌కు నిప్పు పెట్టేశాడు. ఊహించని ఈ పరిణామానికి మంత్రి తేరుకునే లోపే, ఆ రాకెట్ అత్యంత వేగంగా ఆయన ముఖానికి అతి సమీపంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాకెట్ నుంచి వెలువడిన నిప్పు రవ్వలు (Sparks) ఆయన బట్టలపై కూడా పడ్డాయి. ఈ హఠాత్పరిణామంతో అక్కడ ఉన్నవారందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌కి ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన తన నివాసంలో సురక్షితంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. పండుగ పూట బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌లో జరిగిన ఈ ఘటనతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొన్నప్పటికీ, అంతా సురక్షితంగా బయటపడటంతో అక్కడివారంతా ఊపిరి పీల్చుకున్నారు.