AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..

Ar Rahman

Ar Rahman

AR Rahman: నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’. ఈ సినిమా నుంచి విడుదలైన ‘మంగళ్ రంగ్’ అనే కొత్త పాటపై నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది. దీనితో పాటు అంతకుముందు వచ్చిన ‘రావణ తాండవ్’ ట్రాక్‌పై కూడా సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఇలాంటి ఆన్‌లైన్ ట్రోలింగ్, విమర్శలపై ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తాజాగా స్పందించారు. నెటిజన్లు మొదట విమర్శలు చేసి, ఆ తర్వాత తమ తప్పు తెలుసుకుని క్షమాపణలు చెబుతుంటారని వ్యాఖ్యానించారు.

సంగీత సాధన, మేకింగ్ ప్రక్రియలోనే తమకు ఎంతో సమయం పడుతుందని, ఇక సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను పట్టించుకునే ఓపిక గానీ, సమయం గానీ తనకు ఉండవని రెహమాన్ తెలిపారు. “మేము ఎంతో రీసెర్చ్ చేసి, రకరకాల ప్రయోగాలు చేసిన తర్వాతే పాటను శ్రోతల ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి ఆన్‌లైన్ ఫీడ్‌బ్యాక్ వెతుక్కుంటూ కూర్చోను. నా కొడుకు తరచూ వచ్చి… ‘నిన్న మీపై విమర్శలు చేసిన వాళ్లే, ఈరోజు క్షమాపణలు చెప్తున్నారు’ అని చెప్తుంటాడు. నేను మాత్రం నా పనిని ఎంతో నిజాయితీగా పూర్తి చేస్తాను. శ్రోతలు ఈ సంగీతాన్ని ఆస్వాదిస్తారనే భావిస్తున్నాను” అని ఆయన వివరించారు.

‘రావణ తాండవ్’ పాట విడుదలైన కొత్తలో ప్రతికూల కామెంట్లు వచ్చినా, ఆ తర్వాత శ్రోతలు ఆ పాటలోని లోతును గ్రహించి మెచ్చుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. తన మూడు పదుల కెరీర్‌లో ‘రామాయణ’ వంటి పౌరాణిక చిత్రానికి పనిచేయడం ఒక ప్రత్యేక బాధ్యత అన్నారు. “తొలి పదేళ్ల తర్వాత చాలామంది నన్ను ‘రోజా’, ‘బాంబే’ కాలం నాటి సంగీతాన్నే మళ్లీ ఇవ్వమన్నారు. కానీ ‘రాక్‌స్టార్’ లేదా ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ లాంటి పాత విజయాల దగ్గరే ఆగిపోలేం. సంగీత దర్శకుడు పారే నదిలా ప్రవహిస్తూనే ఉండాలి. ఇప్పుడు రామాయణం లాంటి గొప్ప కావ్యానికి ఐదు భాషల్లో పాటలు అందించే అవకాశం రావడం ఒక వరంగా భావిస్తున్నాను” అని రెహమాన్ పేర్కొన్నారు.

కాగా, రణ్‌బీర్ కపూర్ (శ్రీరాముడు), సాయి పల్లవి (సీతాదేవి)లపై చిత్రీకరించిన ‘మంగళ్ రంగ్’ పాటలో ‘కవ్వాలి’ పోలికలు ఉన్నాయంటూ కొంతమంది అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న కథకు ఈ రకమైన ఫ్యూజన్ మ్యూజిక్ ఏమాత్రం సరిపోదని సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ఎప్పుడూ ఒంటరిగానే పనిచేసేందుకు మొగ్గుచూపే రెహమాన్, ఈ సినిమా కోసం ప్రముఖ హాలీవుడ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్‌తో కలిసి పనిచేస్తున్నారు. 14-15 ఏళ్ల క్రితమే ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సమయాన జిమ్మర్ నుంచి కాంబినేషన్ ఆఫర్ వచ్చినా, అప్పట్లో తాను ఖాళీగా ఉండటానికే ఇష్టపడి వదులుకున్నట్లు చెప్పారు. అయితే, రామాయణం వంటి అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టుకు జిమ్మర్ రావడం సినిమా స్థాయిని పెంచుతుందని రెహమాన్ అన్నారు. విదేశీ ప్రేక్షకులు దీనిని కేవలం ఒక సాధారణ భారతీయ సినిమాగా చూడకుండా, ఒక గ్లోబల్ ప్రాజెక్ట్‌గా గుర్తుపడతారని, నిర్మాత నమిత్ మల్హోత్రా తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పదని కొనియాడారు.