ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఇటివల చేసిన కొన్ని వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకుని విమర్శలు గుప్పిస్తుండటంతో, రెహమాన్ కుటుంబ సభ్యులు ఆయనకు అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా రెహమాన్ కుమారుడు అమీన్, తన తండ్రిపై ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చేసిన ప్రశంసల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేశారు. ఈ వీడియోలో మోదీ మాట్లాడుతూ.. ‘ఏఆర్ రెహమాన్ సంగీతం, రాజమౌళి సినిమాలు భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంటున్నాయి’ అని కొనియాడారు. తండ్రి గొప్పతనాన్ని చాటి చెబుతూ అమీన్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read : Atlee : స్పెషల్ పోస్ట్‌తో.. గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్ అట్లీ
మరోవైపు రెహమాన్ కుమార్తె రహీమా కూడా ఈ వివాదంపై ఘాటుగా స్పందించారు. ప్రజలకు పవిత్ర గ్రంథాలు చదివి క్రమశిక్షణ నేర్చుకోవడానికి సమయం ఉండదు కానీ, ఒకరిని నిందించడానికి.. అగౌరవపర్చడానికి మాత్రం ఎప్పుడూ సమయం ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల మధ్య రెహమాన్ స్వయంగా వివరణ ఇస్తూ.. తన ఉద్దేశాలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎవరినీ బాధ పెట్టాలన్నది తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.. ‘భారతదేశం నాకు స్ఫూర్తి, ఇది నా ఇల్లు. భారతీయుడిగా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’ అని పేర్కొంటూ తన దేశ భక్తిని చాటుకున్నారు. కుటుంబం మొత్తం రెహమాన్‌కు అండగా నిలవడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది.
