NTV Telugu Site icon

AR CI Swarnalatha: సినిమాను మించిన ట్విస్టులు.. ఎట్టకేలకు సీఐ స్వర్ణలతపై వేటు

Swarna Latha

Swarna Latha

AR CI Swarnalatha: విశాఖ నేర చరిత్రలో ఇది కొత్త కథ. ఇప్పటివరకు దొంగతనమే వృత్తిగా చేసుకున్న వారిని, డబ్బు అవసరమై అడ్డదారులు తొక్కేవారిని, వ్యసనాలకు బానిసలై చెయిన్‌ స్నాచింగ్‌లు, బైకులు దొంగిలించే వారిని చూశాం. అయితే మొదటిసారిగా ఓ లేడీ పోలీస్‌ ఆఫీసర్‌ దొంగ అవతారాన్ని ఇప్పుడు కళ్లారా చూస్తున్నాం. పోలీసులే దొంగలుగా మారితే.. భయపెట్టి దోచుకుంటే… ఇక ప్రజలకు దిక్కు ఎవరు..? దొంగనోట్ల మార్పిడి కేసులు చాలానే ఉన్నాయి. తక్కువ మొత్తంలో అసలు నోట్లు ఇస్తే.. పెద్ద మొత్తంలో దొంగనోట్లు ఇస్తామని చెప్పి పిలవడం, నోట్లు మార్చుకుంటున్న సమయంలో పోలీసుల వేషంలో దొంగలు వచ్చి ఆ డబ్బు తీసుకుపోవడం చూశాం. అలాగే అసలు నోట్ల మధ్యలో తెల్ల కాగితాలు పెట్టి మోసం చేసిన కేసులూ ఉన్నాయి. కానీ ఇది కొత్త కేసు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా అవసరాలను క్యాష్‌ చేసుకోవాలనుకున్న దుర్బుద్ధి చివరకు ఓ పోలీస్‌ ఆఫీసర్‌ని కటకటాలపాలు చేసింది.

సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన 2వేల రూపాయల నోట్ల మార్పిడి కేసులో విశాఖపట్నం పోలీసులు మహిళా రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు స్వర్ణలత సహా నలుగురిని అరెస్టు చేశారు. కొల్లి శ్రీను, శ్రీథర్ అనే ఇద్దరు రిటర్డ్‌ నేవీ అధికారులు తమకు సర్వీస్ అయిపోయిన తర్వాత వచ్చిన సొమ్ము ద్వారా మరికొంత సంపాదించాలనుకున్నారు. ఇదే సమయంలో కొల్లి శ్రీనుకు, శ్రీధర్ లకు సూరీ పరిచయం అయ్యాడు. తనకో రియల్ ఎస్టేట్ ఏజెంట్ తెలుసునని, అతని వద్ద రెండు వేల రూపాయల నోట్లు భారీగా ఉన్నాయని, మనం అతనికి 90 లక్షల విలువైన 500 నోట్లు ఇస్తే అతను కోటి రూపాయలు రెండు వేల నోట్లు ఇస్తాడని నమ్మబలికాడు. సుమారు రూ 10 లక్షల వరకు ప్రాఫిట్ వస్తుందని ఆశపెట్టాడు. ఈ నెల 3న సాయంత్రం 6 గంటల సమయంలో కొల్లి శ్రీను, శ్రీధర్ కలిసి 90 లక్షలతో ద్వారక పీఎస్ పరిధిలోని NRI హాస్పిటల్ వెనుక వైపు వెళ్లారు. అప్పుడు సూరిబాబు అక్కడకు వచ్చి డబ్బులు చూపించమని అడిగాడు. ఆ సమయంలో అక్కడికి పోలీసు జీపులో కానిస్టేబుల్ హేమసుందర్, హోంగార్డు శ్రీను, ఆర్‌ఐ స్వర్ణలత వచ్చారు.

స్వర్ణలత జీపులోనే కూర్చోగా.. కానిస్టేబుల్‌ హేమసుందర్‌, హోంగార్డ్‌ శ్రీను దిగి సూరి దగ్గరకు వెళ్లారు. ఇక్కడేం చేస్తున్నారని గద్దించారు. బ్యాగులో ఏమున్నాయంటూ దానిని లాక్కుని చూశారు. డబ్బులు చూసి.. ఇవెక్కడివి.. ఎలా వచ్చాయి.. దేనికోసం తెచ్చారని ప్రశ్నిస్తూనే సూరిని కొట్టారు. కొట్టినట్టు నటించారు. సూరిని అరెస్ట్‌ చేస్తున్నట్టు సీన్‌ క్రియేట్ చేశారు. దాంతో రిటైర్డ్‌ నేవీ ఉద్యోగులు భయపడ్డారు. అందరినీ సీతమ్మధార కొండప్రాంతంవైపు తీసుకెళ్లారు. ఆ డబ్బుకు ఎలాంటి పత్రాలు లేనందున కేసు పెడితే లేనిపోని సమస్యలు వస్తాయంటూ భయపెట్టారు. మొత్తం ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వాళ్లు పట్టుకెళ్తారని ఆందోళనకు గురి చేశారు. స్వర్ణలత మేడం చాలా స్ట్రిక్ట్ అని, ఓ 12 లక్షలు ఇస్తే కేసు లేకుండా వదిలేస్తారని చెప్పారు. దాంతో కొల్లి శ్రీను, శ్రీథర్‌లు భయపడి 12 లక్షలు స్వర్ణలతకు ఇచ్చి వెళ్లిపోయారు. ప్లాన్ సక్సెస్ కావడంతో కానిస్టేబుల్‌ హేమసుందర్‌కు 2 లక్షలు, సూరికి 5 లక్షలు, హోంగార్డ్‌ శ్రీనుకు 10వేలు ఇచ్చింది. మిగతా డబ్బును స్వర్ణలత తీసుకుంది.

ఇంటికెళ్లాక కొల్లి శ్రీను, శ్రీధర్‌లకు అనుమానం వచ్చింది. ఇదంతా సూరి, పోలీసులు ఆడిన నాటకంగా అనుమానించారు. దాంతో తర్వాతి రోజు నేరుగా వెళ్లి డీసీపీకి ఫిర్యాదు చేశారు. డీసీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్నీ నిజాలేనని తేలడంతో నిందితులను అదుపులోకి తీసుకుని మూడు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా బ్రోకర్‌ సూరిని, ఏ-4గా ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలతను చూపించారు. హోంగార్డు శ్రీను, డ్రైవర్‌ హేమసుందర్‌లను ఏ-2, ఏ-3లుగా చేర్చారు. స్వర్ణలతను అదుపులోకి తీసుకోగానే ఓ అధికార పార్టీ నేత నుంచి పోలీసు అధికారులకు ఫోన్‌ కాల్‌ వెళ్లిందట. ఆమెను విడిచిపెట్టాలని కోరగా.. పోలీసులు ఒప్పుకోలేదని టాక్. దాంతో ఆ నేత రాజకీయ పలుకుబడితో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన తన వ్యాపార భాగస్వామిని రంగంలోకి దించారు. ఆ వ్యక్తి ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముఖ్యుడికి చెప్పడం, ఆయన వెంటనే అమరావతి నుంచి కమిషనర్‌కు ఫోన్‌ చేసి చెప్పడంతో అధికారులు ఇరకాటంలో పడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కేసు నుంచి స్వర్ణలతను తప్పించలేక, ప్రధాన నిందితురాలిగా కాకుండా ఏ-4గా చేర్చడంతో ఇంకా అనుమానాలు బలపడ్డాయి.

స్వర్ణలతను హీరోయిన్‌గా పెట్టి ఏపీ 31 నంబరు మిస్సింగ్‌ టైటిల్‌తో ఓ సినిమాను నిర్మించడానికి రంగం సిద్ధమైంది. ఇందులో కూడా ఆమెది పోలీసు క్యారెక్టరే. అదే పోజులో పోస్టర్‌ కూడా విడుదల చేశారు. ఈ సినిమా లవ్‌ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అని ప్రకటించారు. ఆమెకు సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా ఉంది. ఆమెతో చాలా సన్నిహితంగా ఉండే అధికార పార్టీకి చెందిన ఓ నేత సినిమా రంగంలో కూడా ఉన్నారు. డాన్సులు నేర్చుకుంటే త్వరలో తీసే సినిమాలో చాన్సు ఇస్తానని చెప్పడంతో గత కొంతకాలంగా ఆమె ఒక కొరియోగ్రాఫర్‌ను ఏర్పాటు చేసుకుని డ్యాన్స్‌ నేర్చుకుంటున్నారు. ఆ సినిమా నిర్మాణంలోనూ ఆమె భాగస్వామిగా ఉన్నట్టు తెలుస్తోంది. విశాఖపట్నంలోని ముఖ్య నేతలతో స్వర్ణలతకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పుడు ఆమె అరెస్ట్‌ కావడంతో ఆ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట. విజయనగరం నుంచి ఎదిగిందామె. భర్త రాజస్తాన్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మొదట్నుంచి ఆమెకు సినిమాలంటే పిచ్చి. నటించాలనే కోరిక తీవ్రంగా ఉండేదామెలో. గతంలో టిక్‌టాక్‌లు కూడా చేసేది. కొన్ని రీల్స్‌ కూడా చేసింది.

అక్రమాల్లో ఆరితేరిపోయింది స్వర్ణలత. పైకి లేడి సింగంలా బిల్డప్‌ ఇచ్చేది. ఆ మధ్య టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యనపాత్రుడిపై తొడకొట్టి మరీ సవాల్‌ చేసింది. చాలాకాలం క్రితం విశాఖపట్నం కమిషనర్‌గా పనిచేసిన మహేష్‌ చంద్ర లడ్డా ఆమెపై వచ్చిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్నారు. శ్రీకాకుళం ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అక్కడ్నుంచి విజయనగరానికి ట్రాన్స్‌ఫర్‌పై వచ్చింది. విజయనగరం నుంచి మళ్లీ విశాఖపట్నం చేరుకుంది. స్వర్ణలత ప్రస్తుతం ఏఆర్‌లో ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నారు. ఆమె హోంగార్డుల విభాగం పర్యవేక్షిస్తున్నారు. హోంగార్డులు ఎక్కడ డ్యూటీ చేస్తున్నారు..?, సరిగ్గా విధులు నిర్వహిస్తున్నారా..? లేదా..? అనేది చూడాలి. డ్యూటీలో భాగంగా అప్పుడప్పుడు ప్యాట్రోలింగ్‌ కూడా చేయాల్సి ఉంటుంది. కానీ ఆ డ్యూటీ లేకుండానే ఆమె పోలీసు వాహనంలో ఇద్దరిని వెంటేసుకొని తిరుగుతూ దందా చేస్తోంది. అందులో ఒకరు హోంగార్డు శ్రీను. అతడు అడ్డగోలుగా సంపాదించడంలో ఆరితేరిపోయాడు. డ్యూటీకి వెళ్లడు. కానీ రిజిస్టర్‌లో సంతకాలు మాత్రం ఉంటాయి. పోలీసులకు అనుమానం వచ్చి రికార్డులు పరిశీలిస్తే… ఆ రోజున శ్రీను స్పెషల్‌ బ్రాంచిలో డ్యూటీలో ఉన్నట్టు నమోదై ఉంది. కానీ తను ఫిజికల్‌గా నేరం జరిగిన సీతమ్మధారలో ఉన్నాడు. శ్రీను వారానికి ఒకసారి వెళ్లి రిజిస్టర్‌లో సంతకాలు చేసేస్తున్నట్టు గుర్తించారు. అలాగే కానిస్టేబుల్‌ హేమసుందర్‌ను కూడా ఆమె తన టీమ్‌లో పెట్టుంది.

ఏదైనా డీల్‌ చేస్తే వచ్చే పది లక్షల్లో ఆమె 7 లక్షలు తీసుకొని, కీలకంగా వ్యవహరించే హోంగార్డు శ్రీనుకు 2 లక్షలు, కానిస్టేబుల్‌ హేమసుందర్‌కు లక్ష ఇవ్వడానికి ఒప్పందం కుదిరిందని సమాచారం. ఆ విధంగా ఈ ముగ్గురు దళారి సూరిబాబుతో కలిసి నోట్ల మార్పిడి చేస్తున్నట్టు తెలిసింది. ఆమెకు 2 వేల నోట్ల మార్పిడిలో కూడా డీల్స్‌ చేసే అవకాశం సన్నిహితంగా ఉండే ఆ నేతే ఇచ్చినట్లు సమాచారం. అందరికీ 10 శాతం కమీషన్‌.. నాకూ అంతేనా అని ఆమె అడిగితే 15 శాతానికి పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ సూరిబాబుతో కలిసి ఆమె డీల్స్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా తెర వెనక ఎన్నో జరుగుతున్నప్పటికీ పోలీసుల పరువు పోతుందని బయటకు చెప్పడం లేదని ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక, 2000 రూపాయల నోట్లు కేసులో అరెస్ట్ అయినా ఆర్.ఐ స్వర్ణ లత, రిజర్వడ్ కానిస్టేబుల్ హేమ సుందర్ లపై చర్యలు తీసుకుంది పోలీసుశాఖ.. క్రమశిక్షణా చర్యలలో భాగంగా ఇరువురిని సస్పెండ్ చేశారు అధికారులు.