NTV Telugu Site icon

Phone Hacking: యాపిల్ సంస్థ నుంచి ప్రతిపక్ష ఎంపీలకు అలర్ట్‌.. కేంద్రం హ్యాక్‌ చేస్తోందని ధ్వజం

Opposition Leaders

Opposition Leaders

Phone Hacking: పలు ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్‌ సంస్థ వార్నింగ్ అలర్ట్ పంపింది. ప్రతిపక్ష ఎంపీల యాపిల్‌ ఐడీ ఆధారంగా స్టేట్‌ స్పాన్సర్డ్‌ అటాకర్స్‌ తమ ఐఫోన్‌, ఈ-మెయిల్స్‌ హ్యాక్‌ చేస్తున్నట్లు యాపిల్‌ హెచ్చరించింది. వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మెసేజ్‌ అందుకున్న వారిలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, శివసేన(ఉద్దవ్‌ వర్గం) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఉండడం గమనార్హం. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, శశి థరూర్‌లతో సహా పలువురు ప్రతిపక్ష నేతలు తమ ఫోన్‌లు, ఈమెయిల్స్‌లో యాపిల్‌ నుంచి మెసేజ్‌లు వచ్చాయని, రాష్ట్ర ప్రాయోజిత దాడికి పాల్పడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. వారు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో యాపిల్‌ నుంచి వచ్చిన అలర్ట్‌ మెసేజ్‌ స్క్రీన్‌ షాట్‌లను షేర్‌ చేశారు. ‘‘ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకర్లు మీ ఐఫోన్‌ను హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మీ ఫోన్‌లోని సున్నితమైన సమాచారంతోపాటు, కమ్యూనికేషన్స్, కెమెరా, మైక్రోఫోన్‌లను వారు యాక్సెస్ చేసే అవకాశం ఉంది’’ అనేది యాపిల్‌ ప్రతిపక్ష నేతలకు పంపిన మెసేజ్‌లోని సారాంశం.

Also Read: OTT: తెలుగు నిర్మాతలకు నిద్రలేకుండా చేస్తున్న OTT ప్లాట్‌ఫారమ్‌లు!

కేంద్రంలోని బీజేపీ సర్కారు తన ఫోన్‌, ఈ-మెయిల్‌ను హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తోందని తృణమూల్‌ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపణలు చేశారు. ఇండియా కూటమి ఎంపీల ఫోన్లను హ్యాక్‌ చేసేందుకు కేంద్రం యత్నింస్తోందని ఆమె ఆరోపించారు. తనతో సహా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్, ఆప్ ఎంపీ రాఘవ్‌ చద్దా, శశిథరూర్, ప్రియాంక చతుర్వేది, సీతారాం ఏచూరి, పవన్ ఖేరా, రాహుల్‌ గాంధీ కార్యాలయానికి యాపిల్‌ నుంచి వార్నింగ్ మెసేజ్‌లు వచ్చాయని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ కంటే ఇది దారుణమని టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా ట్వీట్ చేశారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరరూర్‌ కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. తనకు కూడా యాపిల్‌ నుంచి హెచ్చరిక సందేశం వచ్చినట్లు వెల్లడించారు. తన ఫోన్‌, ఈ-మెయిల్‌ లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొంటూ ట్విటర్‌లో పీఎంవోను ట్యాగ్‌ చేశారు. ప్రభుత్వానికి చేయడానికి ఇంతకుమించిన ముఖ్యమైన పని మరేం లేదా అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. వీరితో హైదరాబాద్‌ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కూడా ఈ హెచ్చరికను అందుకున్నారు. తనకు వచ్చిన మెసెజ్‌ను ఒవైసీ ట్విటర్‌లో పంచుకున్నారు. ‘ప్రియమైన మోడీ ప్రభుత్వం, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు’ అని సోషల్‌మీడియా వేదికగా కాంగ్రెస్ నేత పవన్ ఖేదా రాశారు.

ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. తన ఫోన్ తయారీదారు నుంచి ‘తన ఫోన్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న రాష్ట్ర-ప్రాయోజిత దాడి చేసేవారు’ గురించి తనకు హెచ్చరిక వచ్చిందని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా కూడా ‘తన ఫోన్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్’ గురించి తన ఫోన్ తయారీదారు నుండి తనకు హెచ్చరిక వచ్చిందని చెప్పారు.

ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ, ‘ఈ అలర్ట్ తప్పని ప్రభుత్వం చెప్పాలి… ఏం జరుగుతోంది? దూకుడు రాజకీయాల కింద డిజిటల్ ప్రపంచాన్ని సృష్టిస్తున్నారా? ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో చూడాలి. ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాలి, దీనికి మంత్రిత్వ శాఖ ఉంది, ఏం చేస్తున్నారు?” అని అన్నారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, ‘ఇది చాలా బాధాకరమైన విషయం, ఈ సమాచారం ఉదయం అందింది. కంపెనీ ద్వారా ఈ రకమైన సందేశం వచ్చింది. మీ ఫోన్‌ను రాష్ట్రం హ్యాక్ చేస్తుందని మెసేజ్‌లో చెబుతున్నారు. పాపం, వారు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ, గోప్యతను కూడా తొలగించాలనుకుంటున్నారు. దేనికి గూఢచర్యం? దీనిపై విచారణ జరపాలి.” అని పేర్కొన్నారు.

Also Read: IQOO 12 Launch: నవంబర్ 7న ‘ఐకూ 12’ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. సూపర్ డిజైన్, హై ఎండ్ ఫీచర్స్!

బీజేపీ సమాధానం
ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, తప్పని, ఇది ఎలాంటి సందేశమో ఈ నేతలు యాపిల్‌ను వివరణ కోరాలని, కంపెనీ స్పందనపై అసంతృప్తిగా ఉంటే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా ఈ నేతలను ఎవరు అడ్డుకుంటున్నారు? ఈ సందేశం ఏమిటి. ఇది ఎందుకు పంపబడింది, ఆపిల్ కంపెనీ మాత్రమే దీని గురించి స్పష్టత ఇవ్వగలదు. ఐటీకి సంబంధించిన స్టాండింగ్ కమిటీకి స్వయంగా శశి థరూర్ చైర్మన్‌గా ఉన్నారని, ఈ విషయంలో యాపిల్ కంపెనీని ఎందుకు వివరణ కోరడం లేదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ప్రసాద్ వ్యంగ్యంగా అభివర్ణించారు. రాహుల్ గాంధీ తన ఫోన్‌పై పెగాసస్ గూఢచర్యం చేస్తున్నారని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినట్లు అనిపించిందని, అయితే సుప్రీం కోర్టు తనను కోరినప్పుడు దర్యాప్తు కోసం తన ఫోన్‌ను విచారణ కమిటీకి ఇవ్వండి అని తెలిపిందని, ఆయన ఇవ్వలేదని కేంద్ర మాజీ మంత్రి పేర్కొన్నారు.

Show comments