NTV Telugu Site icon

Apple Price Hike: ఆకాశాన్నంటుతున్న యాపిల్ పండ్ల ధరలు

Apple Tree

Apple Tree

Apple Price Hike: భారీ వర్షాలు, వరదలు, విరిగిపడిన కొండ చరియల కారణంగా హిమాచల్ ప్రదేశ్లో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది. ఆ రాష్ట్రంలో పండిన పంట సరఫరాలో జాప్యం కారణంగా టమాటాల తర్వాత ఆపిల్ ధరల్లో తీవ్ర పెరుగుదల నమోదైంది. దీంతో టమాటాలు, ఇతర కూరగాయలతో పాటు పండ్ల సరఫరా కూడా దెబ్బతింది. ఇప్పుడు దీని ప్రభావం ఢిల్లీ హోల్‌సేల్ మార్కెట్‌పై కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ దెబ్బతింది. దీంతో ఆహార సరఫరా గొలుసు దెబ్బతింది. ఈ ప్రభావం ఢిల్లీలోని ఆపిల్ హోల్‌సేల్ మార్కెట్‌పై పడింది. హిమాచల్ ప్రదేశ్‌లో వర్షం ఎప్పుడూ వ్యవసాయానికి, వ్యాపారానికి నష్టం చేకూరుస్తుందని ఓఖ్లాలోని ఓ షాపు యజమాని చెప్పాడు. ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతానికి బంగాళాదుంప, యాపిల్, నేరేడు వంటి పండ్ల హోల్‌సేల్‌లో హిమాచల్ ప్రదేశ్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.

యాపిల్ ధర ఎంత పెరిగింది
నిజానికి యాపిల్ బాక్స్ ధర వెయ్యి రూపాయలు ఉండాలి. వర్షం కారణంగా దాని ధర 2 వేల రూపాయల నుండి 3 వేల 500 రూపాయలకు పెరిగిందని దుకాణదారుడు చెప్పాడు. హిమాచల్ ప్రదేశ్‌లో రహదారులు దెబ్బతిని అధ్వాన్నంగా ఉండడంతో రైతులు ఒకే ట్రక్కులో పండ్లను ప్యాక్ చేస్తున్నారు. దీని కారణంగా ఈ పండ్లు త్వరగా కుళ్లిపోతున్నాయి. దీంతో పండ్ల సరఫరా దెబ్బతినడంతో పాటు డిమాండ్ కూడా పెరుగుతోంది.

Read Also:Apple USB-C Port: యాపిల్ కీలక నిర్ణయం.. ఐఫోన్ 14 మోడళ్లకు యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌!

ఆపిల్ సరఫరా సమస్య
ఆజాద్‌పూర్ మండికి చెందిన ఒక దుకాణదారుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆపిల్‌ల సరఫరా నిలిచిపోయింది. కొండచరియలు విరిగిపడటంతో తాజా యాపిల్స్ సరఫరా కూడా జరగడం లేదు. అయితే, ఏదో ఒకవిధంగా మధ్య మార్గాల ద్వారా ఆపిల్‌లను సరఫరా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తను తెలిపాడు.

7,480 కోట్లకు పైగా రాష్ట్రం నష్టం
ఈ సంవత్సరం రుతుపవనాల 54 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్‌లో 742 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది 50 ఏళ్లలో సరికొత్త రికార్డు అని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వర్షం కారణంగా 1,200 రోడ్లు మూసుకుపోయి రూ.7,480 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.

Read Also:Hot Chocolate: విమానంలో హాట్‌ చాక్లెట్‌.. చిన్నారికి గాయాలు