AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..

Ap Rains Prediction 2026

Ap Rains Prediction 2026

ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ముఖ్యంగా ఈదురుగాలులతో వర్షం పడే సమయంలో చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ , విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని హెచ్చరించారు.

గురువారం (10-09-2026) రోజున శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడవచ్చు.

శుక్రవారం (11-09-2026) రోజున ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

శనివారం (12-09-2026) రోజున విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ మార్పుల పట్ల గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు, రైతులు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.