ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖలో ఉద్యోగ నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం కీలక సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ రూల్స్-1993కు మార్పులు చేస్తూ, 2025 రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త నిబంధనలను తీసుకువచ్చారు. రవాణా శాఖలోని ఆర్టీఓ, ఎంవీఐ నుంచి ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుళ్ల వరకు అన్ని ఉద్యోగాలను స్థానిక కేడర్లుగా మార్చారు. ఈ మేరకు నియామక యూనిట్లను జోన్లు, మల్టీ జోన్లు, రెవెన్యూ జిల్లాల వారీగా ప్రభుత్వం ఖరారు చేసింది.
కొత్త విధానం ప్రకారం ఆర్టీఓ , మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు రెండు మల్టీ జోన్లు కేటాయించారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఆరు జోన్లను నిర్ణయించారు. ఈ జోన్ల వివరాలను పరిశీలిస్తే.. జోన్-1లో శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు గల జిల్లాలు ఉండగా, జోన్-2లో అల్లూరి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలు ఉన్నాయి. జోన్-3 పరిధిలోకి పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు వస్తాయి.
జోన్-4లో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉండగా, జోన్-5లో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాలు ఉన్నాయి. అలాగే జోన్-6లో నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాలు చేర్చబడ్డాయి.
ఈ కొత్త నిబంధనల ద్వారా రవాణా శాఖలో జరిగే ప్రత్యక్ష నియామకాల్లో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. నియామకాలు, రిక్రూట్‌మెంట్, బదిలీలు, పదోన్నతుల కోసం ప్రత్యేకంగా కొత్త యూనిట్లను ఏర్పాటు చేశారు. రవాణా శాఖలో చేపట్టే పదోన్నతులకు కనీసం రెండేళ్ల సర్వీసు తప్పనిసరి అని స్పష్టం చేశారు.
ఈ సరికొత్త ఉద్యోగ విధానం 2026 జూలై 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా వెల్లడించింది. దీనివల్ల రవాణా శాఖలో స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు పరిపాలనా పరమైన పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.

