AP SSC Exams 2027: పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

Ap 10th Class Exams 2027 Fee Schedule

Ap 10th Class Exams 2027 Fee Schedule

AP 10th Class Exams 2027 Fee Schedule: ఆంధ్రప్రదేశ్‌లో 2027 మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11 నుంచి 25వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు విద్యాశాఖ అధికారులు అవకాశం కల్పించారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ప్రకటించిన గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది. అందువల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా.. ముందుగానే ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు.

నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు రూ.50 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చు. డిసెంబర్ 3 నుంచి 9వ తేదీ వరకు రూ.200 ఆలస్య రుసుము వర్తిస్తుంది. ఇక డిసెంబర్ 10 నుంచి రూ.500 ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అన్ని సబ్జెక్టులకు కలిపి పరీక్ష ఫీజు రూ.125 చెల్లించాలి. మూడు సబ్జెక్టుల వరకు పరీక్ష రాసే విద్యార్థులకు రూ.110 ఫీజుగా నిర్ణయించారు. ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది. వయోపరిమితి సడలింపు కోరుకునే విద్యార్థులు రూ.300 రుసుము చెల్లించాలి. విద్యార్థులు తమ పాఠశాల లాగిన్ ద్వారానే పరీక్ష ఫీజు చెల్లించాలని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. CFMS లేదా బ్యాంకు చలాన్ల ద్వారా ఫీజులు చెల్లించేందుకు అనుమతి లేదని వెల్లడించారు. అలాగే మాన్యువల్ నామినల్ రోల్స్ సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు.

టెన్త్ క్లాస్ పరీక్ష ఫీజు షెడ్యూల్ 2027:
అదనపు రుసుము లేకుండా: 2026 నవంబర్ 11 నుంచి నవంబర్ 25 వరకు
రూ.50 అదనపు రుసుముతో: 2026 నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు
రూ.200 అదనపు రుసుముతో: 2026 డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 9 వరకు
రూ.500 అదనపు రుసుముతో: 2026 డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 15 వరకు