ఏపీలో నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఆరంభం కానున్నాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. మార్చి 31న రంజాన్ పండగలో ఏమైనా మార్పులు చోటుచేసుకుంటే.. సోషల్ పరీక్షలో మార్పు చేయనున్నారు. ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకూ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ప్రశ్నపత్రం చదువుకునేందుకు అదనంగా 15 నిమిషాలు కేటాయించారు. విద్యార్థులకు చివరి నిముషం వరకూ పరీక్షా కేంద్రాలలోకి అనుమతి ఉంటుంది. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యంను ప్రభుత్వం కల్పించింది.
రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల 450 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6 లక్షల 19 వేల 275 మంది విద్యార్ధులు పరీక్షలకు హజరుకానున్నారు. పరీక్ష రోజు పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. పరీకా కేంద్రాల పరిధిలో జిరాక్సు, నెట్ సెంటర్లను మూసి ఉంటాయి. ఫేక్ న్యూస్, వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. విద్యార్థులకు ఎలాంటి అవసరం ఉన్నా.. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ నంబరు 08662974540కి కాల్ చేయొచ్చు. ఇక చీఫ్ సూపరింటిండెంట్ తప్ప ఎవరి మొబైల్ ఫోన్ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదు. ఈసారి రెగ్యులర్ విద్యార్థులతో పాటే.. సార్వత్రిక విద్యాపీఠం అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.