SIR: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో కీలక దశ పూర్తైంది. ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియ అర్ధరాత్రి 12 గంటలకు ముగిసింది. ఈ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా 44,71,523 మంది ఓటర్ల వివరాలను ‘అన్ కలెక్టబుల్’గా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇది మొత్తం ఓటర్లలో ఈ సంఖ్య 10.74% ఉందని అధికారులు తెలిపారు. అన్ కలెక్టబుల్‌గా గుర్తించిన వారిలో మరణించిన ఓటర్లు, ఆచూకీ లేని (Untraceable) ఓటర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారు (Permanent Shift), అలాగే డబుల్ ఎంట్రీలు ఉన్న ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు.
ఈ నెల 31వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు అధికారులు. ముసాయిదా జాబితాలో అన్ కలెక్టబుల్‌గా గుర్తించిన ఓటర్ల వివరాలు కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఆ తర్వాత కొత్తగా ఓటరు నమోదుకు లేదా చిరునామా మార్పు చేసుకోవాలనుకునే వారికి ఫామ్-6, ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
అలాగే అన్ కలెక్టబుల్ జాబితాలో ఉన్న ఓటర్లు తిరిగి తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలంటే ఆధార్ కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రం (Address Proof)తో పాటు అవసరమైన ఇతర పత్రాలను సమర్పించాలని ఎన్నికల అధికారులు సూచించారు. అభ్యంతరాలు, సవరణలు, కొత్త దరఖాస్తుల పరిశీలన అనంతరం అక్టోబర్ 3వ తేదీన తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. దీంతో రాష్ట్రంలో పూర్తిగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తికానుంది.

