NTV Telugu Site icon

AP Polycet: రాష్ట్ర వ్యాప్తంగా నేడు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష

Ap Polycet

Ap Polycet

AP Polycet: ఏపీ వ్యాప్తంగా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పాలిసెట్‌–2023 పరీక్ష ఇవాళ జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి మంగళవారం ప్రకటించారు. మొత్తం 61 పట్టణాల్లో 499 కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఉదయం 10 గంటల్లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష రాసే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. పాలిసెట్‌కు మొత్తం 1,59,144 మంది దరఖాస్తు చేశారని వివరించారు. వీరిలో 96,429 మంది బాలురు, 62,715 మంది బాలికలు ఉన్నారన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 21 వేల దరఖాస్తులు పెరిగాయని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక అవగాహన కార్యక్రమాలతో 26,698 మంది ఎస్సీ, 9113 మంది ఎస్టీ అభ్యర్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు.

Read Also: TS EAMCET: నేటి నుంచి ఎంసెట్ పరీక్షలు.. ఈ సారి కొత్త రూల్స్

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 10 గంటల నుంచే అనుమతించనున్నారు. పరీక్ష ప్రారంభించిన తర్వాత ఎవరినీ అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రవేశ పరీక్ష ఫలితాలు 10 రోజుల్లో విడుదల చేయనున్నారు. మూడేళ్ల పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 29 విభాగాల్లో మొత్తం 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరచిన వారికి మాత్రమే సీట్లు లభిస్తాయి. పాలిసెట్‌ పరీక్షను పెన్‌ అండ్‌ పేపర్‌(ఆఫ్‌లైన్‌) విధానంలో నిర్వహిస్తారు. మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మూడు విభాగాల నుంచి 120 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. మ్యాథ్స్‌–50, ఫిజిక్స్‌–40, కెమిస్ట్రీ–30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. పదోతరగతి స్థాయి సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్‌ మార్కింగ్‌ విధానంలో అమల్లో లేదని అధికారులు వెల్లడించారు.