NTV Telugu Site icon

AP Riots: ఏపీలో హింసాత్మక ఘటనలు.. పోలీసు రియాక్షన్‌ స్టార్ట్..

Ap Police

Ap Police

AP Riots: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తర్వాత మొదలైన గొడవల టెన్షన్‌ కొనసాగుతూనే ఉంది. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉండడంతో పోలీసులు అలర్ట్‌గా ఉన్నారు. ఇక నుంచి ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులో పోలీస్ పికెట్‌ కొనసాగుతుండగా.. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్‌రెడ్డితో పాటు.. కూటమి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. భద్రత మరింత పెంచారు. దేవగుడిలో ఆదినారాయణ రెడ్డి సోదరులు ఇళ్ల వద్ద పోలీసుల మోహరించారు. కొంత వారిని అనుమతించడం లేదు. ఆక్టోపస్ ఎస్పీ ఆధ్వర్యంలో భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సుధీర్ రెడ్డిని మరో ప్రాంతానికి తరలించారు.

Read Also: CM Revanth Reddy: రాష్ట్ర ఆదాయం పెంపుపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జెడ్పీటీసీ భర్త భాను కుమార్‌రెడ్డి, సర్పంచ్ గణపతి రెడ్డిలతో పాటు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. అటు.. చంద్రగిరిలో ఉద్రిక్త పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. రెండు పార్టీల అభ్యర్థులను గృహ నిర్బంధంలోనే ఉంచారు పోలీసులు. మరో వైపు గన్‌మెన్‌ ధరణి ఫైరింగ్‌లో కాలికి బుల్లెట్‌ గాయమైన సుధాకర్‌రెడ్డిని చికిత్స కోసం చెన్నైకి తరలించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి హింసలో పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. వైసీపీ, టీడీపీలకు చెందిన 91 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఉరవకొండ కోర్టులో హాజరు పర్చారు. వారిలో టీడీపీకి చెందిన వారు 54 మంది, వైసీపీకి చెందిన వారు 37 మంది ఉన్నారు. అటు.. కోనసీమ జిల్లాల్లో కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. వల్లూరు గ్రామ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యూదుతో కేసు నమోదు చేశారు అంగర పోలీసులు. జనసేన ఇంఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ భార్య ఇచ్చిన ఫిర్యాదుపై మరో కేసును నమోదు చేశారు. తోట త్రిమూర్తులుతోపాటు మరో నలుగురిపై కేసులు నమోదు చేశారు. మొత్తానికి గురువారం చిన్న చిన్న ఘటనలు మినహా పరిస్థితి అంతా అదుపులో ఉందని తెలిపారు పోలీసులు. నిఘాను కట్టుదిట్టం చేశారు.