AP Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం!

Ap Panchayat Elections 2026

Ap Panchayat Elections 2026

AP Panchayat Elections 2026 Nominations: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. ఎల్లుండి నామినేషన్ల దాఖలుకు తుది గడువు కాగా.. ఈ నెల 18న నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఎన్నికల షెడ్యూల్‌లో భాగంగా అభ్యర్థులకు నామినేషన్ల ఉపసంహరణకు కూడా గడువు కేటాయించారు. ఈ నెల 19న తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్లు స్వీకరిస్తారు. 20వ తేదీన ఆ అప్పీళ్లను పరిష్కరిస్తారు. అనంతరం ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.

ఈ నెల 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాల ప్రకటన అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నారు. అవసరమైన ప్రాంతాల్లో ఈ నెల 27న రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రీపోలింగ్ జరగనుంది. అనంతరం అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు సిద్ధమవుతున్నారు.