AP Panchayat Elections 2026: ప్రారంభమైన రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. 1170 సర్పంచ్, 19655 వార్డులు ఏకగ్రీవం!

Ap Panchayat Elections 2026 Live

Ap Panchayat Elections 2026 Live

AP Gram Panchayat Elections Second Phase 2026: ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను అధికారులు వెల్లడించనున్నారు.

రెండో విడతలో మొత్తం 3,880 గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్నికల ప్రక్రియను అధికారులు నిర్వహిస్తున్నారు. ఇందులో 3,803 సర్పంచ్ స్థానాలు.. 29,603 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో మొత్తం 83,52,338 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సర్పంచ్ పదవుల కోసం 10,295 మంది అభ్యర్థులు.. వార్డు సభ్యుల స్థానాల కోసం 63,395 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో 52 డివిజన్లు, 246 మండలాల పరిధిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం మొత్తం 37,019 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

రెండో దశలో ఇప్పటికే 1,170 సర్పంచ్ స్థానాలు.. 19,655 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు ఓటింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ ద్వారా ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి.. ఫలితాలను వెల్లడించనున్నారు. దీంతో గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి నెలకొంది.