Site icon NTV Telugu

AP Murder: యూట్యూబ్‌లో క్రైమ్ వీడియోలు, ఇంటర్నెట్‌లో హత్య సన్నివేశాలు చూసి.. ఫ్రెండ్ మర్డర్‌కు మాస్టర్ ప్లాన్!

Ap Murder

Ap Murder

ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన సగం కాలిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. తోటి స్నేహితుడే, ఇద్దరు మైనర్ల స్నేహితులతో కలిసి ఆ వ్యక్తిని హత్య చేశాడని నిర్ధారించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అసలు హత్య ఎందుకు చేశారనే అంశాలపై ఆరా తీస్తున్నారు.

ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో ఈ నెల 3న దారుణ హత్య జరిగింది. క్రీడా మైదానం వద్ద సరిగా పాతికేళ్లు కూడా నిండని యువకుడి మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. డెడ్ బాడీ తీరుతెన్నులను బట్టి హత్య కేసుగా నిర్ధారించారు. మృతుడు కంభం మండలం దర్గాకి చెందిన గాలి బ్రహ్మయ్యగా గుర్తించారు. అసలు బ్రహ్మయ్యను హత్య ఎవరు చేశారు? ఎందుకు హత్య చేశారు? అసలు ఏమి జరిగి ఉంటుందనే కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ అధికారులను రంగంలోకి దించారు. హత్య జరిగిన ప్రాంతంలో తమకు దొరికిన కొన్ని ఆధారాలు కూడా పోలీసులు సేకరించారు. అయితే బ్రహ్మయ్యను ఎవరు హత్య చేశారు.. ఎందుకు హత్య చేశారు.. అనే విషయం మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ లోతుగా విచారించే సరికి వారికి నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గాలి బ్రహ్మయ్యను తోటి స్నేహితుడు వెంకట సాయితేజ తన ఇద్దరు మైనర్ల స్నేహితులతో కలిసి హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు.

ప్రకాశం జిల్లా కంభం మండలం దర్గాకు చెందిన గాలి బ్రహ్మయ్య, అదే గ్రామానికి చెందిన వెంకట సాయి తేజ స్నేహితులు. అంతేకాకుండా ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కావడంతో వారి స్నేహం మరింత బలపడింది. ఇద్దరు పలుమార్లు మద్యం తాగేందుకు స్నేహితులతో కలిసి సిట్టింగ్‌లు వేశారు. వెంకట సాయి తేజ.. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతిని వివాహం చేసుకునేందుకు కూడా ఆమె తండ్రిని పెద్దల ద్వారా సంప్రదించాడు. ఈ విషయం బ్రహ్మయ్యకు తెలిసింది. వెంకట సాయి తేజ ఇష్టపడ్డ అమ్మాయి తండ్రికి వెంకట సాయి తేజ మంచివాడు కాదని, వ్యసనపరుడని బ్రహ్మయ్య సమాచారం ఇచ్చాడు. ఈ విషయం వెంకట సాయి తేజ దృష్టికి రావడంతో పలుమార్లు బ్రహ్మయ్యను హెచ్చరించాడు. అయినా పద్ధతి మార్చుకోకపోవడంతో ఎలాగైనా సరే బ్రహ్మయను హత్య చేయాలని వెంకట సాయి సిద్ధమయ్యాడు. యూట్యూబ్‌లో క్రైమ్ వీడియోలు, ఇంటర్నెట్‌లో హత్య జరిగిన సన్నివేశాలు చూసి.. సాక్ష్యాలు ఎలా సేకరిస్తారో అనే సమాచారాన్ని సేకరించి మర్డర్‌కు మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకున్నాడు.

గాలి బ్రహ్మయ్యను హత్య చేసేందుకు 15 రోజుల ముందు ఓ పదునైన కత్తిని కూడా సిద్ధం చేసుకున్నాడు వెంకటసాయి తేజ. ఎప్పుడు మద్యం తాగేందుకు కలుసుకునే ప్రాంతాన్ని వెంకట సాయి తేజ స్పాట్‌గా ఎంచుకున్నాడు. అంతేకాకుండా గతంలో తనతో స్నేహంగా ఉన్న ఇద్దరు మైనర్లను కూడా సాయం కోరాడు. ఆ ఇద్దరు మైనర్లు హత్య చేసేందుకు సహకారాన్ని అందిస్తామని ఒప్పందం చేసుకున్నారు. సెప్టెంబర్ 3న రాత్రి సమయంలో మద్యం తాగేందుకు బ్రహ్మయ్య, వెంకట సాయి తేజ కలుసుకున్నారు. మద్యం తీసుకురావాలని బ్రహ్మయ్యకు వెంకట సాయి తేజ 500 డబ్బులు కూడా ఇచ్చాడు. తెచ్చిన మద్యంతో ఇద్దరు కూర్చొని ఫుల్లుగా తాగారు. ఆ సమయంలో తన ప్రేమ విషయంలో ఇలా ఎందుకు చేశావంటూ వాగ్వివాదం జరిగింది. కోపంతో చేతికి దొరికిన బండ రాయితో వెంకట సాయి తేజ బ్రహ్మయ్య తలపై బలంగా కొట్టాడు. దీంతో కుప్పకూలిపోయిన బ్రహ్మయపై దాడి చేసేందుకు ఇద్దరు మైనర్ యువకులకు సైగ చేశాడు వెంకట సాయి తేజ.. వెంటనే ముగ్గురు కలిసి రాళ్లు కత్తులతో దాడి చేసి హతమార్చారు. అక్కడినుండి సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకు కొంత దూరంలో డెడ్ బాడీని లాక్కొని వెళ్లి ముళ్లపోదల్లో పడేశారు. తమ ద్విచక్ర వాహనంలో ఉన్న కొంత పెట్రోల్‌తో బ్రహ్మయ్య మృతదేహాన్ని కాల్చివేశారు. ఆ తర్వాత బ్రహ్మయ్య మృతదేహాన్ని కొంత దూరం ఈడ్చిపడేసి అతని ద్విచక్ర వాహనాన్ని మరో ప్రాంతంలో ఉంచి హత్య జరిగింది ఈ ప్రాంతంలోనే అని నమ్మించేందుకు నిందితులు ప్రయత్నించారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టి జరిగిన ఘటనపై నిజా నిజాలు వెలికి తీశారు. హత్యకు గల కారణాలను వెల్లడించి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఎండ్: స్నేహాన్ని మర్చిపోయి బ్రహ్మయ్య, వెంకటసాయి తేజ వ్యవహరించడంతో.. ఒకరు చనిపోయారు.. మరొకరు జైలుపాలయ్యారు.

Exit mobile version